ఇలా అయితే నెలలు కాదు.. ఏళ్లు పడతాయి: బైడెన్

ABN , First Publish Date - 2020-12-30T22:53:49+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ సర్కార్ యుద్ధప్రాతిపదికన ఫైజర్, మోడెర్నా టీకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

ఇలా అయితే నెలలు కాదు.. ఏళ్లు పడతాయి: బైడెన్

విల్మింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ సర్కార్ యుద్ధప్రాతిపదికన ఫైజర్, మోడెర్నా టీకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించింది. దీంతో డిసెంబర్ 14న ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. డిసెంబర్ 21 నుంచి మోడెర్నా వ్యాక్సినేషన్ మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రెండు టీకాల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. అయితే, ట్రంప్ సర్కార్ ప్రస్తుతం వ్యాక్సినేషన్‌లో అనుసరిస్తున్న విధానం పట్ల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ పరిపాలన విభాగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


"వారు టీకా పంపణీలో అనుసరిస్తున్నది చాలా పాత పద్ధతి. ఇంకా చెప్పాలంటే చాలా వెనుకబడినది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. ఇలా అయితే అమెరికన్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి నెలలు కాదు.. ఏళ్లు పడతాయి." అని బైడెన్ మండిపడ్డారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసి డైలీ మిలియన్ మందికి టీకా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తన బృందానికి మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం, వ్యాక్సినేషన్ తదితర విషయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు బైడెన్ తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.       

Updated Date - 2020-12-30T22:53:49+05:30 IST