ట్రంప్ సహకరించకపోతే జరిగేది అదే: బైడెన్

ABN , First Publish Date - 2020-11-17T16:10:57+05:30 IST

అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల్లో తానే గెలిచినట్లు మరోసారి ట్వీట్ చేసి ట్రంప్ కలకలం సృష్టించారు.

ట్రంప్ సహకరించకపోతే జరిగేది అదే: బైడెన్

వాల్మింగ్టన్(యూఎస్): అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల్లో తానే గెలిచినట్లు మరోసారి ట్వీట్ చేసి ట్రంప్ కలకలం సృష్టించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన, డెమొక్రటిక్ నేత జో బైడెన్.. ట్రంప్ తీరుపై మండిపడ్డారు. అధికార బదలాయింపులో ట్రంప్ అడుగడుగునా అడ్డుపడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అలాగే కరోనా విషయంలో కూడా తన బృందంతో ట్రంప్ పాలక వర్గం సహకరించాలని కోరారు. ట్రంప్ సహకరించకపోతే మహమ్మారికి మరింత మంది ప్రాణాలు కోల్పోవడం ఖాయం అన్నారు. టీకా ప్రణాళికలు, జాతీయ భద్రత, విధానపరమైన సమస్యల్ని అధికార బదిలీ నిమిత్తం ఏర్పాటు చేసిన తన బృందంతో పంచుకోవాలని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బైడెన్ తెలిపారు. తాము అధికారం చేపట్టే జనవరి 20 కంటే ముందే అధ్యక్షుడు మనసు మార్చుకుని తమకు పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నట్లు బైడెన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సహకరించకపోతే దేశానికి ఇది చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుందన్నారు. 


దేశంలో కొవిడ్-19 విజృంభణ రోజురోజుకీ పెరుగుతున్నందున వ్యాక్సిన్ పంపిణీ చాలా కీలకమైన ప్రక్రియ అని బైడెన్ పేర్కొన్నారు. దానికోసం వెంటనే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికారం చేపట్టే సమయానికి పరిస్థితులు మరింత దిగజారిపోవచ్చని బైడెన్ వాపోయారు. కనుక సాధ్యమైనంత త్వరగా తమతో అధ్యక్షుడు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో తాము తమ సొంత ప్రణాళికల్ని అమలు చేయాల్సి ఉంటుందని బైడెన్ చీఫ్ స్టాఫ్ రోన్ క్లైన్ పేర్కొన్నారు. ఇక తాజాగా అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా టీకాలు కరోనా వైరస్‌పై 90 శాతానికి పైగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే.          


Updated Date - 2020-11-17T16:10:57+05:30 IST