చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ

ABN , First Publish Date - 2020-09-11T06:14:47+05:30 IST

కరోనా దెబ్బకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) విలవిలలాడుతున్నాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని మూతపడగా మరికొన్ని తక్కువ సామర్థ్యంతో...

చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ

కరోనా దెబ్బకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) విలవిలలాడుతున్నాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని మూతపడగా మరికొన్ని తక్కువ సామర్థ్యంతో నెట్టుకొస్తున్నాయి. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం ఎంఎస్‌ఎంఈలు మాత్రమే. కొవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో కొంత ఊరట లభించినా అవి ఇంకా నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. 26 శాతం ఎంఎస్​ఎంఈలు మాత్రమే 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల జరిపిన ఒక సర్వేలో తేలింది. ఆయా పరిశ్రమలకు లిక్విడిటీ ప్రధాన సమస్య అని వెల్లడయింది. కొత్తగా ఆర్డర్లు లేకపోవటం, రవాణాలో సమస్యలు, ముడిసరుకు, కార్మికుల లభ్యతలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. చాలా ఎంఎస్​ఎంఈలు పెద్ద పరిశ్రమల సరఫరా చైన్‌లో భాగంగా ఉంటాయి. ప్రస్తుతం డిమాండ్‌ తక్కువగా ఉండటం వల్ల వాటి నుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి. ఫలితంగా పూర్తి సామర్థ్యం ఉపయోగించు కోలేకపోతున్నాయి. ఈ పరిశ్రమలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించినా క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. గతంలో సరైన సమయంలో రుణం తిరిగి చెల్లించకపోవడం వల్ల వాటిని రాబట్టుకోవటంపై కొందరు బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు తప్ప ప్రైవేట్‌ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అధిక వడ్డీ విధిస్తున్నాయి.


ఆగస్టుతో నెలాఖరుతో బ్యాంకు వాయిదాల మారటోరియం గడువు పూర్తయింది. దీనితో ఈనెల (సెప్టెంబర్​) నుంచి రుణ వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించకపోవటం, కొన్ని యూనిట్లు మూసివేసి ఉండటం వల్ల రుణం చెల్లించలేని పరిస్థితి. కొవిడ్ వల్ల స్వస్థలాలకు వెళ్లిన కార్మికులు పని ప్రదేశాలకు వచ్చేందుకు మొగ్గు చూపటం లేదు. తిరిగొచ్చిన వాళ్లు ఎక్కువ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీనితో కార్మికులపై వెచ్చించాల్సిన ఖర్చు పెరిగిపోతోంది. 


ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఎంఎస్​ఎంఈలకు తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేకుండా విరివిగా రుణాలు ఇవ్వడం. స్థానికంగా ఉద్యోగ లభ్యతను చేపట్టడం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుక నిర్మాణాత్మక చర్యలతో ముందుకు రావడం. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. 

శ్రీనివాస్ గౌడ్ ముద్దం

Updated Date - 2020-09-11T06:14:47+05:30 IST