నాలుగో దశలో హోరా హోరీ!

ABN , First Publish Date - 2021-02-19T05:35:49+05:30 IST

జిల్లాలో నాలుగో దశ పంచాయతీ సంగ్రామంలో హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోరు ‘నువ్వా-నేనా’ అన్నరీతిలో హోరెత్తుతోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, గార, జి.సిగడాం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఈనెల 21న నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 274 గ్రామ పంచాయతీల్లో 15 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 259 స్థానాలలో పోటీ నెలకొంది. వీటిలో దాదాపు ఎక్కువ మండలాలు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఇలాకాలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య రసవత్తర పోరు సాగనుందనేది చర్చనీయాంశమవుతోంది.

నాలుగో దశలో హోరా హోరీ!

- మంత్రి ఇలాకాలో రసవత్తర పోరు!

- టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ

- పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు

- గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నాలుగో దశ పంచాయతీ సంగ్రామంలో హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోరు ‘నువ్వా-నేనా’ అన్నరీతిలో హోరెత్తుతోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, గార, జి.సిగడాం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఈనెల 21న నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 274 గ్రామ పంచాయతీల్లో 15 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 259 స్థానాలలో పోటీ నెలకొంది. వీటిలో దాదాపు ఎక్కువ మండలాలు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఇలాకాలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య రసవత్తర పోరు సాగనుందనేది చర్చనీయాంశమవుతోంది. మూడు దశల ఎన్నికల్లోనూ వైసీపీ మెజార్టీ సాధించినా.. కొన్ని మండలాల్లో మాత్రం టీడీపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. ఇదే ఉత్సాహంతో నాలుగో విడతలోనూ సత్తా చాటేందుకు టీడీపీ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా నరసన్నపేట నియోజకవర్గంలో గురువారం ప్రచారం చేశారు. తమ మద్దతుదారులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో ఎన్నికలు జరగనుండడంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌.. వైసీపీ మద్దతుదారుల తరపున రంగంలోకి దిగారు. గ్రామాల్లో ముఖ్య నేతలతో చర్చలు సాగించారు. ముందుగా ఏకగ్రీవాల కోసం తీవ్ర ప్రయత్నాలు సాగించారు. కానీ మొత్తం తొమ్మిది మండలాల్లో 15 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 738 వార్డు స్థానాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల పోటీ అనివార్యమైనా.. మరోవైపు వైసీపీకి రెబల్స్‌ బెడద ఎక్కువైంది. 

- నరసన్నపేట మండలంలో జమ్ము, కొత్తపోలవలస, నెరగాం పంచాయతీల్లో రెబల్స్‌ మంత్రికి వణుకు పుట్టిస్తున్నారు. దీంతో చేసేది లేక మంత్రి అనుచరగణం ప్రచారంలో మునిగిపోయారు. 

- జలుమూరు మండలంలో అంధవరం, శ్రీముఖలింగం, జోరంకి పంచాయతీల్లో వైసీపీకి రెబల్స్‌ బెంగ పట్టుకుంది. 

- పోలాకి మండలంలో 26 పంచాయతీలు ఉండగా, 8 చోట్ల వైసీపీకి రెబల్స్‌ ఉన్నారు. మంత్రి తనయుడు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

- సారవకోట మండలంలో 35 పంచాయతీలు ఉండగా వైసీపీకి మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల వైసీపీకి పోటీ ఉంది. కోదఅడ్డవలస, కూర్మనాథపురం పంచాయతీల్లో రెబల్స్‌ ఉన్నారు.

- ఇవే కాకుండా మంత్రి నియోజకవర్గంలో మరో 20 స్థానాల్లో వైసీపీ మధ్య పోటీ ఉంది. సారవకోట మండలంలో మంత్రి మేనల్లుడు, మాజీ ఎంపీపీ ఒక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా, మంత్రి తనయుడు మరోవైపు తన అనుచరులను గెలిపించుకొనేందుకు ఎత్తులు వేస్తున్నారు. 

- శ్రీకాకుళం, గార మండలాల్లో కూడా వైసీపీకి రెబల్స్‌ ఉన్నారు. ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో వైసీపీ నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. ఎచ్చెర్ల పరిధిలో కొన్ని  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే అనుచరులు హడావుడి చేస్తున్నారు. కొందరు నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతుండడం విమర్శలకు దారితీస్తోంది. ఏదిఏమైనా నాలుగో విడతలో పట్టుసాధించేందుకు వైసీపీ, టీడీపీ మద్దతుదారులు ఎవరికివారు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Updated Date - 2021-02-19T05:35:49+05:30 IST