కర్నూలు జిల్లాలో YSRCP కి ఊహించని షాక్‌..

ABN , First Publish Date - 2021-11-14T23:45:24+05:30 IST

కర్నూలు : జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్‌లే తగిలాయి.

కర్నూలు జిల్లాలో YSRCP కి ఊహించని షాక్‌..

కర్నూలు : జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్‌లే తగిలాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల సర్పంచ్, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. కొన్ని చోట్ల ప్రతిపక్ష టీడీపీ గెలుపొందగా.. ఎక్కువ చోట్ల అధికార వైసీపీ విజయం సాధించింది. అయితే అధికార పార్టీ అయ్యిండి ఒకట్రెండు చోట్ల, అది కూడా జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి పోటీ చేసిన వార్డులోనే ఓడిపోవడం గమనార్హం. ఇలా పరాజయం పాలవ్వడంతో జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.


ఇక పూర్తి వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 12 ఓట్ల తేడాతో జనార్ధన్ గెలుపొందడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఇలా ఓటమిపాలవ్వడం గమనార్హం.


అలాగే ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీకి షాక్‌ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. మరోవైపు.. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీపై ప్రతిపక్ష టీడీపీనే కాదు.. సీపీఐ కూడా గెలుపొందడం జిల్లా వ్యాప్తంగా ఈ గెలుపోటములపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ రెండు స్థానాల్లో అధికారంలో ఉండి వైసీపీ కోల్పోవడమేంటి..? అని ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలే చర్చించుకుంటున్నారట.



Updated Date - 2021-11-14T23:45:24+05:30 IST