KCR సర్కార్‌కు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ...

ABN , First Publish Date - 2021-10-05T16:50:51+05:30 IST

KCR సర్కార్‌కు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ...

KCR సర్కార్‌కు హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ...

  • గడ్డి అన్నారం మార్కెట్‌ ఓపెన్‌ చేయండి
  • హైకోర్టు ఆదేశం
  • బాటసింగారంలో వసతులు లేవు 
  • లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ స్పష్టీకరణ
  • రైతులు ఇబ్బంది పడకూడదన్న బెంచి

హైదరాబాద్‌ సిటీ : గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించే విషయంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం మూసేసిన గడ్డిఅన్నారం మార్కెట్‌ను తిరిగి ఓపెన్‌ చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈనెల 18వరకు పాత మార్కెట్లోనే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పండ్ల మార్కెట్‌ కమీషన్‌ ఏజెంట్లు, పండ్ల రైతులు, కొనుగోలుదారులు, ఇతరులు తమ కార్యాలయాల్లోకి వెళ్లేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని పేర్కొన్నది. గడ్డిఅన్నారం మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్‌ పార్కుకు తరలించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.


అక్కడ ఎలాంటి సౌకర్యాలూ లేవని పేర్కొంటూ గడ్డిఅన్నారం కమీషన్‌ ఏజెంట్ల సంఘం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు బాట సింగారంలో సౌకర్యాలపై పరిశీలన జరిపిన రంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌  అథారిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. పండ్ల మార్కెట్‌ వద్ద ఉండాల్సిన పోలీసు స్టేషన్‌, బ్యాంకులు, కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలు, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంలు లేవని నివేదిక స్పష్టం చేస్తున్నదని హైకోర్టు తెలిపింది. దీనికితోడు అక్కడి స్థలాన్ని ఇతర కంపెనీలకు లీజుకిచ్చారని వెల్లడించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గంగయ్యనాయుడు వాదించారు. పండ్లను నిల్వ చేసుకునే పరిస్థితి లేనప్పుడు బాటసింగారం వెళ్ళి లాభమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదించారు.


బాటసింగారంలో మరో 15 రోజుల్లో కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. 15రోజుల్లో ఏర్పాట్లు చేస్తామన్నప్పుడు ఇప్పుడు తొందర ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వం మూసేసిన గడ్డిఅన్నారం మార్కెట్‌ను తిరిగి తెరవాలని ఆదేశించింది. దీంతోపాటు కోల్డ్‌స్టోరేజీ, కార్యాలయాలు, ఇతర సౌకర్యాలపై అదనపు అఫిడవిట్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివాదం వల్ల  రైతులు ఇబ్బంది పడకూడదనేది తమ ఉద్దేశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే బాటసింగారం వెళ్లిపోవాలనుకునే వ్యాపారులు వెళ్లవచ్చని పేర్కొన్నది.

Updated Date - 2021-10-05T16:50:51+05:30 IST