మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి భారీ షాక్... రూ.1,000 కోట్ల ఆస్తుల జప్తు...

ABN , First Publish Date - 2021-11-02T18:37:58+05:30 IST

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌, ఆయన

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి భారీ షాక్... రూ.1,000 కోట్ల ఆస్తుల జప్తు...

ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాలలో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఓ సహకార పంచదార మిల్లు కూడా ఉందని వివరించారు. 


గత నెలలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.184 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్‌ను కూడా జప్తు చేసినట్లు తెలిసింది. ఇవన్నీ బినామీ ఆస్తులని ఐటీ శాఖ గుర్తించినట్లు తెలిసింది. ఈ ఆస్తులను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తూ యాంటీ బినామీ చట్టం ప్రకారం ఐటీ శాఖ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. 


అజిత్ పవార్ సోదరీమణులకు చెందిన ఇళ్ళు, సంస్థలపై గత నెలలో ఐటీ శాఖ సోదాలు జరిగాయి. ఈ సోదాలపై అజిత్ పవార్ స్పందిస్తూ, ఈ సంస్థలన్నీ క్రమబద్ధంగా పన్నులు చెల్లిస్తున్నాయని తెలిపారు. తాను ఆర్థిక మంత్రినైనందున తనకు ఆర్థిక క్రమశిక్షణ బాగా తెలుసునన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తన సోదరీమణులకు సుమారు 35 సంవత్సరాల క్రితం వివాహమైందని, వారి ఇళ్ళు, సంస్థలపై కూడా సోదాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-02T18:37:58+05:30 IST