చిన్న పరిశ్రమలకు పెద్దకష్టం

ABN , First Publish Date - 2022-06-27T07:40:39+05:30 IST

చిన్న పరిశ్రమలకు పెద్దకష్టం

చిన్న పరిశ్రమలకు పెద్దకష్టం

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జగన్‌ ప్రభుత్వం వంచన 

రీస్టార్ట్‌ ప్యాకేజీ అంటూ కోట్లు కుమ్మరించి ప్రకటనలు

ఇచ్చింది సున్నా.. ‘3 నెలల విద్యుత్‌ బిల్లులూ’ అంతే

కొత్త పరిశ్రమలకు బీసీల ప్రోత్సాహకాల్లో కోత

ఎస్సీ, ఎస్టీల సబ్సిడీ ట్రాక్టర్ల పథకానికీ మంగళం 

వైసీపీ సర్కారు తీరుతో ఎంఎస్‌ ఎంఈలు కుదేలు

నేడు ఎంఎస్ ఎంఈల దినోత్సవం


ఎన్నికలకు ముందు, అధికారంలో వచ్చాక ఇచ్చిన పలు హామీలను జగన్‌ సర్కారు విస్మరించింది. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)ను ఆదుకుంటామన్న హామీ కూడా ఆ ఖాతాకే చేరింది. అంతేగాక పరిశ్రమల ఏర్పాటుకు మొదట్లో ఇచ్చే సబ్సిడీలను మూడేళ్ల తర్వాత అంటూ వాయిదా వేసింది. బీసీల ప్రోత్సాహకాలకు కోత పెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ కింద అందించే ట్రాక్టర్ల స్కీమ్‌నూ అటకెక్కించింది. వారు స్వశక్తితో ఎదగకుండా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఎంఎ్‌సఎంఈల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తీరుతో ఆ పరిశ్రమ కుదేలైన వైనంపై ప్రత్యేక కథనం. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పరిస్థితి  దారుణంగా తయారైంది. ఉన్న పరిశ్రమలను నడపలేక, అప్పుల వాయిదాలు కట్టలేక యజమానులు నలిగిపోతున్నారు. కొవిడ్‌ దెబ్బకు వేల పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. కొన్ని మూతపడ్డాయి కూడా. క్లిష్టసమయంలో ప్రభుత్వం నుంచి ఏమాత్రం సాయం అందలేదు. ఆదుకుంటామని మాట ఇచ్చి కూడా జగన్‌ సర్కారు తప్పింది. రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఏదేదో చేసేస్తామని ఆర్భాటంగా కోట్లు కుమ్మరించి ప్రకటలు ఇచ్చి పైసా కూడా ఇవ్వలేదు. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఆశించినంతగా లేవు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు పారిశ్రామికాభివృద్ధి పథకం కింద సబ్సిడీతో ఇచ్చే ట్రాక్టర్ల పథకానికి ఇటీవల మంగళం పాడేసింది. జగన్‌ సర్కారు విధానాలతో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు కుదేలవుతున్నాయి. దళితులు, గిరిజనులు, బీసీలను దగా చేయడంతో పాటు యువత ఉపాధి అవకాశాలకు గండి కొడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో ఎంఎ్‌సఎంఈలన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వం హఠాత్తుగా ఆదేశించడంతో వాటిని మూసేశారు. కార్మికులంతా వెళ్లిపోయారు. యంత్రాలు తుప్పుబట్టిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎంఎ్‌సఎంఈలను తిరిగి నడిపించడం ఎంతో కష్టం. అయినా అప్పటికే చేసిన అప్పులు తీర్చడం కోసమైనా వాటిని నడపాల్సిన పరిస్థితి. కష్టాల్లో ఉన్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సాయం చేశాయి. కేంద్రం కూడా ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ముందుకొచ్చింది. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు బ్యాంకుల్లో ఉన్న రుణాలపై అదనంగా కొంత రుణం ఇస్తామని ప్రకటించింది. మూతపడి, ఆదాయం లేక కునారిల్లిన పరిశ్రమలకు కొంత అదనపు మూలధనం అందిస్తామని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందించలేదు. కొవిడ్‌తో పరిశ్రమలు మూసేసినందున మూడు నెలల పాటు కనీస విద్యుత్‌ బిల్లులు చెల్లించనక్కర్లేదని, దాన్ని ప్రభుత్వమే జమ చేస్తుందని హామీ ఇచ్చింది. కానీ అది కూడా ఇంతవరకూ చెల్లించలేదు. 


దళితులకు దగా..

గతంలో ఎస్సీ, ఎస్టీలకు పారిశ్రామికాభివృద్ధి పథకం కింద ట్రాక్టర్ల కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చేవారు. 2015-20 పారిశ్రామికాభివృద్ధి విధానంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేర్చారు. 2015 నుంచి ఎంతోమంది దళితులు, గిరిజనులకు ట్రాక్టర్లు, ట్రక్కులు సబ్సిడీపై అందించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే 45 శాతం, పురుషులకైతే 35 శాతం సబ్సిడీ ఇచ్చారు.  మిగతా మొత్తంలో కొంత బ్యాంకు రుణం, మరికొంత లబ్ధిదారులు పెట్టుకునేవారు. ట్రాక్టర్లు, ట్రక్కులు ఇచ్చే పథకాన్ని సూక్ష్మ పారిశ్రామిక యూనిట్లుగా గత ప్రభుత్వం పరిగణించింది. ట్రాక్టర్లను అద్దెకిచ్చి బతుకుతారనే ఉద్దేశంతో ఆ పథకం పెట్టింది. మున్సిపాలిటీల్లో చెత్త రవాణా నుంచి ఆహార ఉత్పత్తుల రవాణా వరకు అద్దెకు ఇచ్చుకుని, ఆ రాబడితో ఎస్సీ, ఎస్టీలు లబ్ధిపొందేలా చేసింది. అయితే వైసీపీ సర్కారు ఈ పథకానికి ఎసరు పెట్టింది. ఈ పథకాన్ని ఆపేయాలంటూ ఈ నెల మొదటివారంలో పరిశ్రమల శాఖ ఆదేశించింది. ఈ పథకాన్ని ఆపేయడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితులు, గిరిజనులను దగా చేయడమేనని మండిపడుతున్నాయి. పెద్దగా చదువుకోని దళితులు, గిరిజనులు కూడా ట్రాక్టరు, ట్రక్కును అద్దెకు ఇచ్చి తేలిగ్గా జీవనం సాగించేవారని, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా ప్రభుత్వం చేసిందని విమర్శిస్తున్నాయి. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే దళితులకు దగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పరిశ్రమలు, కొంత పెట్టుబడి అవసరం అయిన పరిశ్రమలు పెట్టలేని పేద దళితులు, గిరిజనుల కోసమే గతంలో ఈ పథకం పెట్టారు. ట్రాక్టరు ధర రూ.5 లక్షలు, ట్రక్కు ధర రూ.1.5-2 లక్షల వరకు ఉండగా, అందులో 45, 35 శాతం చొప్పున సబ్సిడీ ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించడంతో దళితులు, గిరిజనులకు ఆ అవకాశం లేకుండా పోయింది. తమ జీవనానికి ఆసరా ఇచ్చే పథకాన్ని తీసేయడం దారుణమని దళిత పారిశ్రామిక సంఘాలు విమర్శిస్తున్నాయి. 


ప్రోత్సాహకాలేవీ..? 

రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. తూకాన్ని బట్టి రాయల్టీ అనే విధానం తీసుకురావడం, అదేసమయంలో కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యవహారాలు, వసూళ్ల వల్ల ఈ పరిశ్రమ తీవ్రంగా కుదేలైందనే విమర్శలున్నాయి. మరోవైపు ఆహారశుద్ధి పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వలేదు. కొవిడ్‌ ముందు నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకుని చేయూతనందిస్తే తప్ప ఉన్న ఎంఎ్‌సఎంఈలు ముందుకుసాగని పరిస్థితి. ప్రభుత్వం సాయం చేయకుండా, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా, చెప్పిన మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రకటనలతో సరిపెట్టుకుంది.


బీసీలకు చేయిచ్చిన సర్కారు

గతంలో పారిశ్రామిక విధానం కింద ఎంఎ్‌సఎంఈలను ప్రారంభించే బీసీలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా రాయితీలు ఇచ్చేవారు. ప్రోత్సాహకాలు అందించేవారు. ఎంఎ్‌సఎంఈలు ప్రారంభించే బీసీ మహిళలకు 75 లక్షల వరకు సబ్సిడీ ఉండేది. ఒక యూనిట్‌ ఖర్చులో బీసీ మహిళలకైతే 45 శాతం, బీసీ పురుషులకైతే 35 శాతం ప్రోత్సాహకాలు అందించేవారు. అయితే ఇప్పుడు అవన్నీ తీసేశారు. గతంలో 75 లక్షల వరకు ఉన్న ప్రోత్సాహకాలను ఇప్పుడు యూనిట్‌కు రూ.15 లక్షలకు పరిమితం చేశారు. బీసీలను కూడా జనరల్‌ కేటగిరీతో సమానంగా పరిగణించడంతో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న వారికి శరాఘాతంగా మారింది. వారి పారిశ్రామిక ఆశలను మొగ్గలోనే తుంచేసినట్లయింది. 


సాయంలో ‘రివర్స్‌’ బాట 

ప్రస్తుతం ఉన్న పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉంటే.. కొత్త పరిశ్రమల ఏర్పాటే ప్రశ్నార్థకమవుతోంది. ప్రభుత్వ విధానాల వల్ల కొత్తగా ఎంఎ్‌సఎంఈలు ప్రారంభించడం మాట అటుంచి.. ఆ ఆలోచన చేయాలంటేనే ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎవరైనా పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం కొంత సబ్సిడీలు అందించి సాయం చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ విధానాన్ని పూర్తిగా ‘రివర్స్‌’ చేసింది. పరిశ్రమలు ఏర్పాటు చేశాక మూడేళ్ల పాటు నడిపించి, చెప్పిన ఉద్యోగాలు ఇచ్చి, ఉత్పత్తిలో 80 శాతం లక్ష్యం చేరుకుంటేనే సబ్సిడీలు ఇస్తామని మెలిక పెట్టింది.  ప్రభుత్వమే మూడేళ్ల తర్వాత సబ్సిడీలు ఇస్తామంటే.. తామెందుకు రుణాలివ్వాలంటూ బ్యాంకులూ ముందుకురావడం లేదు. దీంతో ఎంఎ్‌సఎంఈల ఏర్పాటు అంతంతమాత్రంగానే ఉంది. దీని ఫలితంగా ఉద్యోగ, ఉపాధి కల్పన బాగా తగ్గిపోయింది. నిరుద్యోగ రేటులో దేశంలోనే మొదటి వరుసలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ చేరడానికి ఇది కూడా ఒక కారణం. 

Updated Date - 2022-06-27T07:40:39+05:30 IST