Bihar floor test : బిహార్ శాసన సభ సభాపతి రాజీనామా

ABN , First Publish Date - 2022-08-24T17:51:41+05:30 IST

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం

Bihar floor test : బిహార్ శాసన సభ సభాపతి రాజీనామా

పాట్నా : ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బుధవారం శాసన సభలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందే శాసన సభ సభాపతి విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha) తన పదవికి రాజీనామా చేశారు.  విజయ్ మాట్లాడుతూ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాను తన పదవికి రాజీనామా సమర్పించి ఉండేవాడినని, అయితే తనపై కొందరు తీవ్రమైన ఆరోపణలు చేసినందువల్ల సభలో తన వాదనను వినిపించాలనుకున్నానని తెలిపారు. 


తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉందని, నిబంధనలకు అనుగుణంగా లేదని విజయ్ కుమార్ తెలిపారు. తొమ్మిది మంది ఇచ్చిన లేఖల్లో  ఎనిమిది లేఖలు నిబంధనలకు అనుగుణంగా లేవన్నారు. తాను పక్షపాతంతో, నియంతృత్వంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారని, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పు అని తెలిపారు. 


జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీల కూటమి ప్రభుత్వానికి 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు జేడీయూ వర్గాలు చెప్తున్నాయి. ఎన్డీయే నుంచి జేడీయూ బయటికొచ్చిన తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు రెండు రోజులపాటు ప్రత్యేకంగా శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. 


బిహార్ శాసన మండలి చైర్మన్ పదవికి జేడీయూ నేత దేవేశ్ చంద్ర ఠాకూర్ (Devesh Chandra Thakur)  నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా, మాజీ ఉప ముఖ్యమంత్రి తార్‌కిషోర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, శాసన సభ సమావేశాలకు తాము హాజరవుతున్నామని చెప్పారు. ఆర్జేడీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాల గురించి ప్రస్తావిస్తూ, సీబీఐ స్వతంత్ర సంస్థ అని, తన పని తాను చేసుకుంటుందని చెప్పారు. ఈ రోజే ఎందుకు సోదాలు చేస్తున్నారో ఆ సంస్థే చెప్తుందన్నారు. బిహార్ శాసన సభ రాజ్యాంగ వ్యవస్థ అని, దేవాలయం వంటిదని తెలిపారు. ఇక్కడ ఏం జరిగినా నిబంధనల ప్రకారమే జరుగుతుందన్నారు. 


శాసన సభ వెలుపల సీపీఐ-ఎంఎల్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, సీబీఐ సోదాల ద్వారా తమను బెదిరించేందుకు జరుగుతున్న కుట్రల వల్ల ఫలితం ఉండదన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు తాము చేసిన ప్రతిపాదనను పరిశీలించి, చర్చించాలన్నారు. 


ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ జరిగినట్లు సీబీఐ (Central Bureau of Investigation) ఆరోపించింది. లాలూ సన్నిహితుడు సునీల్ సింగ్, ఆర్జేడీ నేతలు సుబోధ్ రాయ్, అష్ఫక్ కరీం, ఫయాజ్ అహ్మద్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసింది. 


Updated Date - 2022-08-24T17:51:41+05:30 IST