Target 2024: నిన్నటిదాకా కేసీఆర్ ఒక్కరే... నేడు నితీశ్ కూడా..

ABN , First Publish Date - 2022-09-05T22:36:03+05:30 IST

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు.

Target 2024: నిన్నటిదాకా కేసీఆర్ ఒక్కరే... నేడు నితీశ్ కూడా..

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ దంపతులను కలుసుకుని చర్చలు జరిపాక ఆయన హస్తినకు చేరుకున్నారు. 






రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో అధికారిక సమావేశాలు ముగియగానే ఆయన ఈ రాత్రికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. బీజేపీయేతర పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే యత్నాలను ఆయన ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్ట అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా మిగతా రాజకీయ పార్టీల నేతలను  కలుసుకోనున్నారు. చర్చలు జరపనున్నారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానిపైనా ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉంది. మొత్తం 3 రోజుల పాటు హస్తినలో ఉండనున్న నితీశ్ మోదీ వ్యతిరేకులందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు యత్నించనున్నారు.   


వాస్తవానికి మోదీపైన, కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపైన యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొంతకాలంగా బీజేపీయేతర పక్షాల నేతలతో వరుస సమావేశాలు జరిపారు. తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, కేరళ సీఎం విజయన్, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులతో సమావేశమై చర్చలు జరిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తదితరులను ఇటీవలే పాట్నాలో కలుసుకుని చర్చలు జరిపారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కేసీఆర్ కోరుతున్నారు. ఇటీవలే బీజేపీతో కటీఫ్ చెప్పి ఆర్జేడీతో జత కట్టిన నితీశ్‌ కేసీఆర్‌తో సమావేశం తర్వాత ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. పాట్నా విలేకరుల సమావేశంలో నితీశ్‌ను ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారా అన్న ప్రశ్నకు ప్రతిపాదించడానికి తానెవరినని కేసీఆర్ తిరిగి ప్రశ్నించారు. అయినా ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూర్చుని చర్చించుకుని, ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. కేసీఆర్‌ పాట్నా నుంచి హైదరాబాద్ వెళ్లగానే నితీశ్ ఇప్పుడు హస్తినకు పయనమయ్యారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పోరాడే ప్రతిపక్షనేతగా నితీశ్ సడన్‌గా తెరపైకి వచ్చేశారు. బీజేపీ కటీఫ్ సమయంలోనే కేసీఆర్ కలవడంతో ఆయన చురుగ్గా జాతీయ రాజకీయాలవైపు మళ్లాలని నిర్ణయించుకున్నారు. 


ప్రస్తుతానికి దక్షిణాది నుంచి కేసీఆర్, ఉత్తరాది నుంచి నితీశ్ ఏకకాలంలో మోదీపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. రాబోయే కొద్ది రోజుల్లో మరింత మంది నాయకులు క్యూ కట్టే అవకాశముంది. 2024 పార్లమెంట్ ఎన్నికలు నల్లేరుపై నడక కాదనే సిగ్నల్స్ మోదీ సర్కారుకు పంపడమే లక్ష్యంగా కేసీఆర్, నితీశ్ పావులు కదుపుతున్నారు. 



Updated Date - 2022-09-05T22:36:03+05:30 IST