Nitish Lalu meets Sonia: సోనియాతో చర్చల తర్వాత లాలూ-నితీశ్ ఫుల్ ఖుుష్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2022-09-26T02:47:35+05:30 IST

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

Nitish Lalu meets Sonia: సోనియాతో చర్చల తర్వాత లాలూ-నితీశ్ ఫుల్ ఖుుష్.. ఎందుకంటే?

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బీహార్‌లో బీజేపీకి బైబై చెప్పి జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశాక ఈ ఇద్దరూ నేతలు తొలిసారి సోనియాతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. హర్యానాలో దేవీలాల్ జయంతి సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ప్రతిపక్ష నేతలు పెద్ద సంఖ్యలో హాజరైన విషయాన్ని నితీశ్-లాలూ సోనియాకు వివరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై చర్చించారు. ఇందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, దేవీలాల్ జయంతి సందర్భంగా జరిగిన బహిరంగ సభకు హాజరైన నేతలంతా కూటమి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని నితీశ్-లాలూ సోనియాకు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక అక్టోబర్ 19 తర్వాత మరోసారి కలుద్దామని సోనియా చెప్పారని నితీశ్-లాలూ తెలిపారు. 






మరోవైపు నితీశ్-లాలూ సోనియా సమావేశంపై బీహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ స్పందించారు. ప్రతిపక్షాల కూటమి అనేది భ్రమ అని, కేజ్రీవాల్‌ను కాంగ్రెస్‌ను కలపగలరా అని సుశీల్ మోదీ ప్రశ్నించారు. కూటమిలో ఒకరంటే ఒకరికి పడదన్నారు. 




మరోవైపు హర్యానాలోని ఫతేబాద్‌ (Fatebad)లో మాజీ ఉపప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా ఐఎన్ఎల్‌డీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎన్‌సీపీ సుప్రీం శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్, ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, శివసేన నేత అర్వింద్ సావంత్ తదితరులు హాజరయ్యారు. గతంలో ఎన్డీయే పక్షాలుగా ఉన్న అకాలీదళ్, జేడియూ, శివసేన ఉద్ధవ్ వర్గం నేతలు సభకు హాజరవడంతో లాలూ-నితీశ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-09-26T02:47:35+05:30 IST