ద్రవ్యోల్బణం దెబ్బ...రెచ్చిపోతున్న లంచావతారాలు..!

ABN , First Publish Date - 2022-09-12T23:52:54+05:30 IST

ద్రవ్యోల్బణం దెబ్బకు సామాన్యుడు విలవిల్లాడుతుంటే, ద్రవ్యోల్బణం ప్రభావం పడిన కొందరు అధికారులు పెరిగిన ధరలకు..

ద్రవ్యోల్బణం దెబ్బ...రెచ్చిపోతున్న లంచావతారాలు..!

పాట్నా: ద్రవ్యోల్బణం దెబ్బకు సామాన్యుడు విలవిల్లాడుతుంటే, ద్రవ్యోల్బణం ప్రభావం పడిన కొందరు అధికారులు పెరిగిన ధరలకు అనుగుణంగా తాము తీసుకునే ముడుపుల సొమ్ము అమాంతం పెంచేసి పబ్బం గడుపుకొంటున్నారు. బీహార్‌లో ఈ పరిస్థితి గత దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. కోవిడ్ కాలంలో లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తాజా ద్రవ్యోల్భణం మరింత దిగజారేలా చేస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో కొద్దికాలంగా విజిలెన్స్ శాఖ వలవేసి పట్టుకున్న కేసులను విశ్లేషించి చూస్తే, చాలా కేసుల్లో అధికారులు డిమాండ్ చేస్తున్న మొత్తం రూ.50,000 వరకూ ఉంటోంది. పలు కేసుల్లో లక్ష రూపాయలు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి.


పాట్నాలో గత మార్చిలో దీపక్ కుమార్ సింగ్ అనే పోలీస్ కానిస్టేబుల్‌ను అధికారులు పట్టుకున్నారు. రూ.4.5 లక్షలు లంచం తీసుకుంటూ అతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గత నెలలో సుపౌల్ జిల్లాలో గ్రామీణ పనుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న హేమ్‌ చంద్ర లాల్ కర్నా రూ.62,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతని నివాసంపై జరిగిన దాడుల్లో రూ.6.50 లక్షల నగదు దొరికింది. గత ఏడాది భవన నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ కుమార్‌ రూ.8 లక్షల లంచం తీసుకున్నందుకు అరెస్టయ్యాడు.2019 నవంబర్‌లో రోడ్ల నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరవింద్ కుమార్ రూ.16 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రూ.8.30 కోట్ల రోడ్‌ ప్రాజెక్టు కోసం ఆయన కుదుర్చుకున్న రూ.80 లక్షల లంచం ఒప్పందంలో తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.16 లక్షలు తీసుకుంటూ మొదట్లోనే ఆయన పట్టుబడ్డాడు. దీనికి ముందు ఇదే శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ ప్రసాద్ సింగ్ రూ.14 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతని ఇంటిపై జరిపిన దాడుల్లో రూ.23 లక్షల నగదు మంచాల కింద, సూట్‌కేసులు, లాకర్లలో పట్టుబడింది. రెవెన్యూ క్లర్క్ రాజా రామ్ సింగ్ ఒక గ్రామస్థుడి నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మొదట్లో అతను 20 లక్షలు డిమాండ్ చేసి చివరికి రూ.5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. లంచం ఏదైనా లంచమే అయినప్పటికీ.... కనీస మొత్తంగా లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు. 2016 అక్టోబర్ 17న నవడా సర్కిల్ ఆఫీసులో నజీర్‌గా ఉన్న నంద్ లాల్ పాశ్వాన్ రూ.500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.


లంచం సొమ్ము పెంచేశారు...ఎందుకంటే..?

ఇటీవల కాలంలో కొందరు అధికారులు అమాంతం ఎక్కువ మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తున్న మాట నిజమేనని, ఇది ఆందోళన కలిగిస్తోందని విజిలెన్స్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తాజా పరిస్థితిని విశ్లేషించారు. డబ్బుపై దురాశ, అనైతికత పెరగడం, ద్రవ్యోల్బణం ఇందుకు ప్రధాన కారణాలని ఆయన ఎన్నారు. పట్టుబడితే అనుభవించాల్సిన శిక్షపై చాలామందికి ఖాతరు లేకుండా పోయిందని, అవినీతి కేసులు పెరిగిపోతుండటానికి ఇదొక ప్రధాన కారణమని మాజీ డీజీపీ అభయానందర్ విశ్లేషించారు. చర్యలు తీసుకోవడంలో ఎలాగూ జాప్యం జరుగుతుందనే భావన కూడా వీరిలో కనిపిస్తోందని అన్నారు.


చట్టవ్యతిరేకులపై చర్యలు తీసుకోవడంలో గట్టి పేరున్న మరో ఐపీఎస్ అధికారి అమితబ్ దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ అవకతవకల విధానాల వల్ల బీహార్‌లో అవినీతికి అడ్డు లేకుండా పోతోందని అన్నారు. ప్రభుత్వం పలు చట్టాలతో ముందుకు వస్తున్నా అవినీతి కేసులు పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. నిజాయితీపరులు, నిబద్ధత కలిగిన అధికారులను పక్కనపెట్టడం వంటి లోపాలు కూడా అవినీతి పెచ్చరిల్లడానికి కారణమని అన్నారు. అవినీతి అనేది అధికారుల డీఎన్ఏలో ప్రవేశించడం, అత్యాశ పెరిగిపోవడం వల్ల అవినీతి పరిఢవిల్లుతోందని ఆయన విశ్లేషించారు. ద్రవ్యోల్బణం కూడా ఎక్కువ మొత్తంలో అధికారులు లంచం అడగడానికి ఒక కారణమవుతోందని దాస్ తప్పుపట్టారు.

Updated Date - 2022-09-12T23:52:54+05:30 IST