KCR in Bihar: కేసీఆర్ 15 సార్లు బతిమాలినా కూర్చోని నితీశ్

ABN , First Publish Date - 2022-09-01T19:36:42+05:30 IST

పాట్నా: బీజేపీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీహార్‌‌లో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది.

KCR in Bihar: కేసీఆర్ 15 సార్లు బతిమాలినా కూర్చోని నితీశ్

పాట్నా: బీజేపీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీహార్‌‌లో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి ఆయన పాట్నాలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ ఘటన జరిగింది. బీజేపీయేతర పక్షాల ప్రధాని అభ్యర్ధిగా నితీశ్‌ను ప్రతిపాదిస్తారా అని విలేకరి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆయనను ప్రతిపాదించడానికి తానెవర్ని అని కేసీఆర్ విలేకరిని తిరిగి ప్రశ్నించారు. ఈ క్రమంలో నితీశ్ తాను కూర్చున్న కుర్చీలోనుంచి లేచి నిల్చున్నారు. ఆ వెంటనే ఆయన పక్కనే ఉన్న తేజస్వీ యాదవ్ కూడా నిల్చున్నారు. అయినా విలేకరులు ప్రశ్నలు అడుగుతునే ఉన్నారు. ఆ సమయంలో కేసీఆర్ విలేకరుల ప్రశ్నలకు జవాబు చెబుతూనే కూర్చోమని నితీశ్‌ను బతిమాలారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 15 సార్లు బతిమాలారు. అయినా నితీశ్ కూర్చోలేదు. చివరకు 16వ సారి మళ్లీ రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ నితీశ్ గారు కూర్చొండి. విలేకరుల సమావేశం ఐదు నిమిషాల్లో ముగించేస్తానని చెప్పారు. అప్పుడు నితీశ్ కూర్చునేందుకు అంగీకరించారు. నితీశ్ కూర్చున్న కాసేపటికే కేసీఆర్ విలేకరుల ప్రశ్నలకు జవాబులు చెప్పి సమావేశం ముగించేశారు.  


విలేకరుల సమావేశంలో కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ తన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా అతి త్వరలో బీజేపీయేతర పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఓ ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. కేసీఆర్ అతి త్వరలో ఉత్తరప్రదేశ్‌లోనూ పర్యటించనున్నారు. 


కేసీఆర్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితర దిగ్గజాలను కలుసుకున్నారు. వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చి కేంద్రం నుంచి బీజేపీ సర్కారును గద్దె దించడమే తన లక్ష్యమని కేసీఆర్ ప్రకటించుకున్నారు. 





Updated Date - 2022-09-01T19:36:42+05:30 IST