Bihar political crisis: నితీశ్‌‌కు షా ఫోన్..

ABN , First Publish Date - 2022-08-09T03:12:51+05:30 IST

పాట్నా: భారతీయ జనతా పార్టీతో జేడియూ తెగతెంపులు చేసుకుంటోందన్న కథనాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్‌‌‌కు ఫోన్ చేశారు.

Bihar political crisis: నితీశ్‌‌కు షా ఫోన్..

పాట్నా: భారతీయ జనతా పార్టీతో జేడియూ తెగతెంపులు చేసుకుంటోందన్న కథనాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా  బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్‌‌‌కు ఫోన్ చేశారు. తాజా పరిణామాలపై చర్చించారు. తొందరపడొద్దని, చర్చించి సమస్యలు పరిష్కరించుకోవచ్చని షా సూచించారని సమాచారం. బీహార్‌లోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే పొత్తు కొనసాగుతోంది. అయితే కొద్ది రోజులుగా తలెత్తుతున్న పరిణామాలతో నితీశ్ నొచ్చుకుంటున్నారని తెలిసింది. 


తన పార్టీకే చెందిన  కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్‌కు రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగియడంతో ఆయన్ను కొనసాగించడం నితీశ్‌కు ఇష్టం లేదు. అందుకే ఆయన్ను తిరిగి రాజ్యసభకు పంపలేదు. ఆర్సీపీ సింగ్ తనకు తాను బీహార్‌కు కాబోయే సీఎంగా ప్రమోట్ చేసుకోవడం కూడా నితీశ్‌కు నచ్చలేదు. ఆర్సీపీ సింగ్ తన మాట కన్నా అమిత్ షా మాట వినడం కూడా నితీశ్ కన్నెర్రకు కారణమైంది. కేంద్ర మంత్రివర్గంలో జేడియూ తరపున ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడం కూడా నితీశ్‌కు నచ్చలేదు.


బీహార్‌లోనూ షా ప్రభావం పెరగడం, జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా షా మాటే వినడం నితీశ్ కోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 77, జేడియూకు 45 సీట్లు మాత్రమే వచ్చినా కూడా బీజేపీ అధిష్టానం నితీశ్‌నే సీఎం చే‌సింది. అయినా కూడా నితీశ్ సంతోషంగా లేరు. జేడియూపై పూర్తిగా బీజేపీ పట్టు సాధించిందని నితీశ్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీతో పొత్తు వద్దనుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 


మరోవైపు నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆదివారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించారని సమాచారం. మరోవైపు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌తో కూడా నితీశ్ ఇప్పటికే రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. 2013లో బీజేపీతో పొత్తు తెంచుకున్న నితీశ్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 


ఎన్డీయేతో పొత్తు కొనసాగించాలా లేక తెంచుకోవాలా అనే అంశంపై తేల్చుకునేందుకు నితీశ్ కుమార్ జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన మంగళవారం ( ఆగస్ట్ 9) ఉదయం 11 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లేందుకు ఎక్కువ మంది జెడియూ ఎమ్మెల్యేలు సంసిద్ధంగా లేరని కూడా తెలుస్తోంది. మధ్యంతర ఎన్నికల కన్నా ఆర్జేడీతో పొత్తు కుదుర్చుకోవడం మేలని మెజార్టీ జెడియూ ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. గతంలో కూడా బీహార్‌లో నితీశ్ సీఎంగా, తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా కొంతకాలం సంకీర్ణ సర్కారు కొనసాగింది. ఏం జరిగిందో ఏమో నితీశ్ ఆర్జేడీతో పొత్తుకు బైబై చెప్పేసి మళ్లీ పాత నేస్తం బీజేపీతో జత కట్టారు. ప్రస్తుతం బీజేపీకి టాటా చెప్పి ఆర్జేడీతో కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


అటు రాష్ట్రీయ జనతాదళ్ కూడా మంగళవారం ( ఆగస్ట్ 9)న పాట్నాలో సమావేశం నిర్వహించనుంది. పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఈ సాయంత్రానికి పాట్నా చేరుకోవాలని తేజస్వీ యాదవ్ ఆదేశించారు. బహుశా జేడియూ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆర్జేడీ తన పావులను కదపనుంది. జేడియూ కనుక ఎన్డీయే‌కు గుడ్‌బై చెబితే నితీశ్‌ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసే విషయంపైనా యోచిస్తారు. 


కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను పాట్నాలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించింది. 


243 మంది సభ్యులున్న బీహార్ శాసనసభలో ఆర్జేడీకి 80, బీజేపీకి 77, జేడియూకు 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 122. జేడియూ, కాంగ్రెస్‌, వామపక్షాలు కలిస్తే సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. 

Updated Date - 2022-08-09T03:12:51+05:30 IST