Bihar political crisis: నితీశ్ ఇలా చేస్తారని ముందే ఊహించిన కమలనాథులు!

ABN , First Publish Date - 2022-08-10T01:35:50+05:30 IST

పాట్నా: నితీశ్ కటీఫ్ చెబుతారని కమలనాథులు ముందే ఊహించారా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు.

Bihar political crisis: నితీశ్ ఇలా చేస్తారని ముందే ఊహించిన కమలనాథులు!

పాట్నా: నితీశ్ కటీఫ్ చెబుతారని కమలనాథులు ముందే ఊహించారా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. అందుకే ఆయన మనసు మార్చేందుకు అంత తీవ్ర స్థాయిలో యత్నాలు చేయలేదని చెబుతున్నారు. చివరి నిమిషంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసినా నితీశ్ మనసు మార్చుకోలేదని తెలిసింది. అంతేకాదు బీహార్ బీజేపీ నేతలు నితీశ్‌ను బుజ్జగించేందుకు యత్నించారని... అయితే నితీశ్ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడలేదని సమాచారం. బీజేపీతో ఉండటం వల్ల నానాటికీ తనకు జనాదరణ తగ్గుతోందని, రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని నితీశ్ అనుమానించారని సమాచారం. గతంలో బీజేపీతో పోటాపోటీగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ సంఖ్యలో తన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. బీజేపీతో పోలిస్తే సగానికి సగం బలం పడిపోవడం ఆయనలో ఆందోళనకు కారణమయ్యుండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పొత్తు ఇలాగే కొనసాగితే 2025 నాటికి తాను మరింత బలహీనపడవచ్చని ఆయన ఊహించి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే బలమైన సాకు చూపించి ఆయన బయటకు వెళ్లాలనుకున్నారని, కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్‌ అంశాన్ని వంకగా చూపి నితీశ్ బీజేపీతో పొత్తును వదులుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే జేడియూ నుంచి అతి తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచినా తాము నితీశ్‌ను ముఖ్యమంత్రిని చేశామని, అయినా ఆయన ప్రభుత్వాన్ని కూల్చి వెళ్లారని కమలనాధులు చెబుతున్నారు. నితీశ్ ద్రోహాన్ని ప్రజలకు తెలియజెబుతామంటున్నారు.  


నితీశ్ తనకు తానుగా తమను వదిలిపెట్టి పోయారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. అంతేకాదు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా నాడు నితీశ్ బీజేపీతో కలిసి పనిచేశారని, అకస్మాత్తుగా ఏమైందో తెలియడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా నితీశ్‌ను ముఖ్యమంత్రిని చేశామని ఆయన గుర్తు చేశారు. నితీశ్ నమ్మకద్రోహాన్ని బీహార్ ప్రజలు గమనిస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మోదీ పేరుతో నెగ్గిన నితీశ్... ప్రజా తీర్పును అవమానించారని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో నితీశ్ ప్రజలను కూడా వంచిస్తారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. 

Updated Date - 2022-08-10T01:35:50+05:30 IST