Advertisement

మోహరింపులు

Oct 22 2020 @ 00:13AM

బిహార్‌లో రాజకీయ శక్తుల మోహరింపు పూర్తి అయింది. ప్రచార పర్వానికి, పోలింగ్‌ సమరానికి అంతా సిద్ధం అయ్యారు. ఒక ప్రి–పోల్‌ సర్వే ఫలితం జనతాదళ్‌–యు, బిజెపి కూటమికి అనుకూలంగా వచ్చింది. ఘనవిజయం ఏమీ కాదు కానీ, పది పదకొండు సీట్ల ఆధిక్యంతో నితీశ్‌ తిరిగి అధికారంలోకి వస్తారని ఆ సర్వే చెబుతోంది. కూటమిలో ఉండిన పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జెపి, ఇప్పుడు సొంతంగా పోటీచేస్తానంటూ, కేవలం నితీశ్‌ పార్టీ మీదనే అభ్యర్థులను నిలుపుతోంది. అందువల్ల బిజెపికి ఎక్కువ స్థానాలు వస్తాయని ఒక అంచనా. ఈ ఏర్పాటు బిజెపియే తెరవెనుక నుంచి నడిపించిందని రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. ఎక్కువ స్థానాలు తమకే వచ్చినా, నితీశే ముఖ్యమంత్రి అని చెబుతూ బిజెపి ఓదార్పు వాక్యాలు పలుకుతున్నది. కాంగ్రెస్‌, ఆర్‌జెడి, వామపక్షాల మహాగట్‌బంధన్‌ ప్రచారఘట్టంలో పైచేయి అయి, పుంజుకుంటే తప్ప ఫలితం సర్వే ఊహించినట్టే ఉండవచ్చు. మనకు తెలియని అంతస్స్రవంతి ఏదో పోలింగ్‌ సమయంలో పెల్లుబికి, ఆశ్చర్యకరమైన ఫలితం వస్తే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అవుతుంది. 


బిజెపి అశ్వమేథయాగం ముగింపు ఘట్టానికి చేరుకుందని, యాగం చివరలో బలి ఇచ్చే అశ్వం ‘ఎన్‌డిఎ కూటమి’ అని ప్రముఖ పాత్రికేయులు శేఖర్‌గుప్తా తాజా కాలమ్‌లో వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వంలో ఇప్పుడు రామ్‌దాస్‌ అథవాలే మినహా మరో బిజెపియేతర మంత్రి లేరు. కూటమి ప్రభుత్వం అన్న పేరును సాంకేతికంగా అయినా సార్థకం చేసే అకాలీదళ్‌ వైదొలగింది. ఎల్‌జెపి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూశారు. ఇప్పటికిప్పుడు, ఇతర పార్టీల వారిని మంత్రివర్గంలో చేర్చుకోవలసిన అగత్యం ఏమీ బిజెపికి లేదు. ఆ పార్టీకి సౌకర్యవంతమైన మెజారిటీ ఉన్నది. రాజ్యసభలో ఇంకా ఇబ్బందులున్నాయి, ఇంకా గెలవవలసిన కొత్తరాష్ట్రాలు ఉన్నాయి. నిలుపుకోవలసిన రాష్ట్రాలూ ఉన్నాయి.  

వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగవలసి ఉన్న తమిళనాడులో కూడా రాజకీయ సన్నివేశం దాదాపుగా సిద్ధమయింది. బిజెపికి తమి ళనాడు ఒక రకంగా నిలుపుకోవలసిన రాష్ట్రం, మరో రకంగా గెలుచుకోవలసిన రాష్ట్రం. జయలలిత మరణం తరువాత, అన్నాడిఎంకెలో వచ్చిన అంతఃకలహాలను ఆసరా చేసుకుని, శశికళ మీద ఉన్న పాత కేసుపై సమయానుకూలంగా వెలువడిన తీర్పును ఉపయోగించుకుని– ప్రభుత్వం పడిపోకుండా కొనసాగించగలిగారు కేంద్రవ్యూహకర్తలు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు శశికళకు సాష్టాంగ పడిన పళనిస్వామి, జయలలిత కీలుబొమ్మగా పేరుపొందిన పన్నీర్‌ సెల్వం, ఎవరి ముఠాలను వారు నడుపుకుంటూ ప్రభుత్వాన్ని సఖ్యంగా నడుపుతున్నారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, అదే స్థానంతో సంతృప్తిపడి, వచ్చే ఎన్నికలలో పళనిస్వామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని అంగీకరించారు. జయ మరణం తరువాత కొద్దిరోజులకే జైలుకు వెళ్లిన శశికళ, శిక్ష పూర్తిచేసుకుని విడుదలయ్యే సమయం వచ్చింది. ఆమె రంగప్రవేశానికి ముందే ఢిల్లీ వ్యూహకర్తలు అన్నాడిఎంకెలో ఐక్యతను విధించారు. ఎఎంఎంకె అన్న పేరుతో దినకరన్‌ పెట్టిన కొత్త పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న శశికళ, అన్నాడిఎంకెను చీల్చలేదని, ఆమె రాజకీయంగా అప్రధాన వ్యక్తిగా మిగిలిపోతారని పరిశీలకుల అంచనా. ఎందుకయినా మంచిదని ఆదాయపన్ను శాఖ వారు కూడా ఆమె ఆస్తులను జప్తుచేసే పని హుటాహుటిన చేపట్టారు. 


లెక్కప్రకారం డిఎంకెకు పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. గత లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ ఘనవిజయం సాధించింది. కానీ, పళనిస్వామి ప్రభుత్వం స్థిరంగా ఉండడమే కాకుండా, కరోనా కట్టడి వంటి కీలకమయిన అంశాలలో బాగా పనిచేసిందన్న పేరు తెచ్చుకున్నది. అతనికున్న చెడ్డపేరల్లా, కేంద్రానికి కీలుబొమ్మ అని మాత్రమే. డిఎంకె నేత స్టాలిన్‌ బిజెపిపై పోరాటంలో బాగా చురుకుగా ఉన్నారు కానీ, రాష్ట్రప్రభుత్వంపై పోరాడడానికి ఆయనకు పెద్దగా అంశాలేవీ దొరకడం లేదు. హిందీ విధింపు, నీట్‌ వ్యతిరేకత వంటి అంశాలలో పళనిస్వామి ప్రభుత్వం కూడా తమిళ మనోభావాలను దాటిపోలేదు. 


ఇంతలో అసలైన లిట్మస్‌ పరీక్ష వచ్చింది. శ్రీలంక తమిళ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితకథాచిత్రంలో నటించడంపై వివాదం తలెత్తి, విజయ్‌ సేతుపతి అనే నటుడు విరమించుకోవలసి వచ్చింది. ‘ఈలం’ ఉద్యమానికి తమిళులలో ఆరాధన ఇంకా కొనసాగుతున్నది. వారి తమిళ అస్తిత్వానికి అది ఒక గీటురాయి అవుతున్నది కూడా. కొత్తగా బిజెపి తీర్థం తీసుకున్న సినీనటి కుష్బూ తన సాహస వ్యక్తిత్వానికి తగినట్టుగా, తమిళమనోభావాలకు భిన్నమయిన వైఖరిని ప్రకటించారు. తమిళులు పట్టింపుతో ఉండే అంశాలను వివాదాస్పదం చేసి ప్రయోజనం పొందడం కష్టం. బిజెపి వ్యూహకర్తలు అటువంటి ప్రమాదకరమైన పద్ధతులను ప్రోత్సహిస్తారని భావించలేము. ఎందుకంటే, తమిళ అస్తిత్వం అన్నది డిఎంకె సొంత క్రీడాస్థలం. 


బిహార్‌, బెంగాల్‌, తమిళనాడు... రానున్న రోజులలో రాజకీయ సంచలనాలకు వేదికలు!

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.