ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రంలోనే బీహార్ యువ బ్యాటర్ ప్రపంచ రికార్డు!

ABN , First Publish Date - 2022-02-18T23:55:25+05:30 IST

రంజీట్రోఫీలో భాగంగా మిజోరంతో ఇక్కడి జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రంలోనే బీహార్ యువ బ్యాటర్ ప్రపంచ రికార్డు!

కోల్‌కతా: రంజీట్రోఫీలో భాగంగా మిజోరంతో ఇక్కడి జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్ యువ బ్యాటర్ సకీబుల్ గనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ బాదిన ఆటగాడిగా తన పేరును రికార్డు పుస్తకాల్లోకి ఎక్కించుకున్నాడు. మొత్తంగా 405 బంతులు ఎదుర్కొన్న 22 ఏళ్ల గనీ 56 బౌండరీలు, 2 సిక్సర్లతో 341 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మధ్యప్రదేశ్ ఆటగాడు అజయ్ రొహేరా పేరున ఉంది. 2018లో అజయ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో 345 బంతుల్లో అజేయంగా 267 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును సకీబుల్ గనీ బద్దలుగొట్టాడు.


కాగా, ఇదే మ్యాచ్‌లో గనీ సహచరుడు బాబుల్ కుమార్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 398 బంతుల్లో 27 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 229 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు బీహార్ తన తొలి ఇన్నింగ్స్‌ను 686 పరుగులకు డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి మిజోరం తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. 

Updated Date - 2022-02-18T23:55:25+05:30 IST