బిల్డర్ల అక్రమాలపై కన్నెర్ర

ABN , First Publish Date - 2021-04-23T05:09:31+05:30 IST

సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో అక్రమంగా అపార్ట్‌మెంట్లు నిర్మించి రూ.లక్షల్లో విక్రయాలు సాగిస్తున్న బిల్డర్ల ఆట కట్టించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

బిల్డర్ల అక్రమాలపై కన్నెర్ర
సత్తుపల్లి మునిసిపల్‌ కార్యాలయం

 కదిలిన ‘సత్తుపల్లి’ యంత్రాంగం

 అనుమతుల్లేని నిర్మాణాలకు నోటీసులు 

 వార్డుల సర్వే నిర్వహించి పరిశీలించనున్న అధికారులు

 ఓపెన్‌ డ్రెయిన్లలోకి మరుగుదొడ్ల పైపులు

సత్తుపల్లి, ఏప్రిల్‌ 22 : సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో అక్రమంగా అపార్ట్‌మెంట్లు నిర్మించి రూ.లక్షల్లో విక్రయాలు సాగిస్తున్న బిల్డర్ల ఆట కట్టించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పట్టణంలో అనుమతులు లేకుండా కొంద రు, పొందిన అనుమతులను మించి ఇంకొందరు నిర్మాణా లు సాగిస్తున్నారు. మాయమాటలు చెబుతూ రూ.లక్షలకు ఫ్లాట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది సదరు బిల్డర్ల మాయ లో పడి ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకమైన అనుమతులు రాకుండానే కొందరు బిల్డర్లు అపార్ట్‌మెంట్ల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో పునాది దశలోనే పోర్షన్లు అమ్మి అడ్వాన్సులు కూడా తీసుకున్న బిల్డర్లున్నారంటే సత్తుపల్లి పట్టణంలో బిల్డర్లు ఎంతకు తెగించారో స్పష్టమవుతోంది. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్టాట్లు అక్రమమని తేలటంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలో కొందరు బిల్డర్ల అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు వెలువరిస్తుండటంతో పట్టణంలో జరుగుతున్న ఈ దందా వెలుగులోకి వచ్చింది. స్పందించిన మునిసిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొంత సమాచారం సేకరించినట్టు తెలిసింది. బిల్డర్ల అక్రమాలపై నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. పట్టణంలో అనుమతులు ఉండి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వారు, అసలు ఏ రకమైన అనుమతులు లేకుండా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు మునిసిపల్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆరు అపార్ట్‌మెంట్లను అధికారులు గుర్తించారు. కనీసం పార్కింగ్‌ కూడా లేకుండా సెల్లార్‌లో పోర్షన్లు నిర్మించిన బిల్డర్‌తో పాటు అసలు ఏ విధమైన అనుమతులు లేకుండానే అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేస్తున్న వారికి కూడా నోటీసులు సిద్ధం చేసినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు. వార్డుల వారీగా సర్వే చేసి అపార్ట్‌మెంట్లు ఎక్కడ నిర్మాణంలో ఉన్నాయి. వాటికి ఉన్న అనుమతులు, నిర్మాణం జరుగుతున్న తీరుపై సమాచారం సేకరించనున్నట్లు ఆమె తెలిపారు. అధికారులు వార్డుల వారీగా జరుగుతున్న నిర్మాణాలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు.


సెప్టిక్‌ ట్యాంకు లేకుండానే నిర్మాణాలు..!


అపార్ట్‌మెంట్లకు సంబంధించి ఫ్లాట్లలో స్నానపుగదులు, మరుగుదొడ్ల మురుగు బయటకు పోయేందుకు భవనం స్థలంలో సెప్టిక్‌ ట్యాంకు నిర్మించి మరుగుదొడ్ల పైప్‌లైన్లను సెప్టిక్‌ ట్యాంకుకు కలపాల్సి ఉన్నా అసలు సెప్టిక్‌ ట్యాంకు నిర్మాణమే చేయని పరిస్థితి పట్టణంలో ఒకటి రెండు అపార్ట్‌మెంట్లలో కనిపిస్తోందంటే.. కొందరు బిల్డర్ల అక్రమాలకు పరాకాష్టగా చెప్పొచ్చు. సెప్టిక్‌ ట్యాంకు నిర్మించకపోగా పట్టణంలో అంతర్గత రహదారుల పక్కన ఉన్న ఓపెన్‌ డ్రైయినేజికి పైప్‌లైన్‌ కలిపినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల వారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. సెప్టిక్‌ పైప్‌లైన్లు ఓపెన్‌ డ్రైయినేజిలో కలిపేందుకు సత్తుపల్లి పట్టణంలో అనుమతి లేదు. కానీ కొందరు బిల్డర్లు ఈ రకమైన అక్రమాలకు పాల్పడటంతో వాతావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉంది. ఒక పక్క సత్తుపల్లి పట్టణం బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా మునిసిపల్‌ అధికారులు, పాలకవర్గం కృషి చేసింది. కానీ ఇలాంటి బిల్డర్ల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా భవన నిర్మాణాలు చేసిన ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.


పైప్‌ లైన్లు డమ్మీ చేయించాం: మునిసిపల్‌ కమిషనర్‌ 


అపార్ట్‌మెంట్లలో సెప్టిక్‌ ట్యాంకులు నిర్మించకుండా ఓపె న్‌ డ్రైయిన్‌లోకి మరుగుదొడ్ల పైపులు వదిలిన అపార్ట్‌మెంట్లను గుర్తించాం. భవనాల్లో నుంచి మురుగు ఓపెన్‌ డ్రైయిన్లలోకి వచ్చేలా ఏర్పాటు చేసిన పైప్‌ లైన్లను సిమెంట్‌ కాంక్రీట్‌తో డమ్మీ చేయించా. అపార్ట్‌మెంట్లలో తక్షణమే సెప్టిక్‌ ట్యాంకులు నిర్మించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2021-04-23T05:09:31+05:30 IST