మిలిందా గేట్స్‌‌తో విడాకులపై స్పందించిన బిల్‌గేట్స్

ABN , First Publish Date - 2022-05-02T23:40:44+05:30 IST

వాషింగ్టన్ : అమెరికా వ్యాపార దిగ్గజం, Microsoft సహవ్యవస్థాపకుడు Bill Gates తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మిలిందా గేట్స్‌‌తో విడాకులపై స్పందించిన బిల్‌గేట్స్

వాషింగ్టన్ : అమెరికా వ్యాపార దిగ్గజం, Microsoft సహవ్యవస్థాపకుడు Bill Gates తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాజీ భార్య Melinda Gates తో వివాహం ఎంతో విలువైనదిగా ఆయన అభివర్ణించారు. కాలం వెనక్కి వెళితే మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని మనసులో మాట చెప్పారు. ‘సండే టైమ్స్’తో ఆయన మాట్లాడారు. కొవిడ్-19 మహమ్మారి, మిలిందాతో విడాకుల వల్ల గత రెండేళ్లు ఎంతో నాటకీయంగా గడిచాయి. కానీ పిల్లలు దూరంగా నివసిస్తుండడం తన జీవితంలో అసహజమైన, విచిత్రమైన భాగంగా ఆయన అభివర్ణించారు. మాజీ భార్య మిలిందా గేట్స్‌తో ప్రస్తుతం ఎలాంటి బంధాలను కలిగివున్నారు, ఇద్దరూ దూరమవ్వడాన్ని ఏవిధంగా భావిస్తున్నారనే అంశాలపై బిల్ మనసు విప్పి మాట్లాడారు.


‘‘పిల్లలు పెద్దవాళ్లై, ఇంటిని వీడాక ప్రతి వివాహం బంధంలోనూ మార్పులు సంభవిస్తాయి. నా విషయంలో విడాకుల మార్పు జరిగింది. మిలిందాతో విడిపోయినప్పటికీ.. నా దృష్టిలో ఆమెతో వివాహం ఎంతో విలువైనది. ఈ అభిప్రాయంలో మార్పు రాలేదు. వేరెవరినీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. మిలిందా గేట్స్‌ని మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా.. ఔను అని టక్కున సమాధానమిచ్చారు. రెండోసారి మిలిందా గేట్స్‌ను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకే బదులిస్తున్నానని తన అభిప్రాయాన్ని బలంగా చెప్పారు. ఇక భవిష్యత్ విషయానికి వస్తే ఎలాంటి ప్రణాళికలు లేవు. కానీ పెళ్లి విషయంలో ముందుకే వెళ్తానన్నారు. ఇద్దరం ఇంకా స్నేహితులుగానే ఉన్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక విడాకుల విషయంలో ఇద్దరం కోలుకుంటున్నామని చెప్పారు.


విడాకుల విషయంలో రాజీపడేందుకు నెమ్మదిగా అడుగులేస్తున్నాననే విషయం తెలియదు. కానీ మిలిందా గేట్స్‌తో ఇంకా కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని బిల్‌గేట్స్ చెప్పారు. ఫౌండేషన్‌కు సంబంధించిన వార్షిక సమావేశాలు ఉంటాయి. ఉమ్మడిగా పాల్గొంటాం. జూన్‌లో జరగబోయే వార్షిక సమావేశానికి ఇద్దరం ఆతిథ్యమివ్వబోతున్నామని ఆయన చెప్పారు. కాగా బిల్‌-మిలిందా గేట్స్ దంపతులు దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితానికి మే 2021లో ముగింపు పలికారు. విడాకులు తీసుకుంటున్నట్టుగా ఆగస్టు 2021లో ప్రకటించారు. అయితే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను ఉమ్మడిగా నిర్వహించాలనుకుంటున్నట్టు వెల్లడించారు. వీరికి ముగ్గురు పిల్లలు- జెన్నెర్, రోరీ, ఫొబే ఉన్నారు.

Read more