బిల్లులు అందక.. భవనాలు పూర్తికాక!

ABN , First Publish Date - 2022-08-19T04:00:48+05:30 IST

బిల్లులు అందక.. భవనాలు పూర్తికాక!

బిల్లులు అందక.. భవనాలు పూర్తికాక!
నిర్మాణాలు మధ్యలోనే ఆగిన బూర్జపాడు అంగన్‌వాడీ కేంద్రాలు

- దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న అంగన్‌వాడీ భవనాలు

- నిర్మాణం పూర్తయినా ప్రారంభించని వైనం

- సిబ్బందికి తప్పని ఇబ్బందులు

- చిన్నారులు, గర్భిణీలకు అసౌకర్యం

- పట్టించుకోని ప్రభుత్వం


(ఇచ్ఛాపురం రూరల్‌/మెళియాపుట్టి)

- ఇచ్ఛాపురం మండలం బూర్జపాడులో రెండు అంగన్‌వాడీ భవనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.14లక్షలు మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిపివేశారు. మూడేళ్లుగా భవనాలు ఇలా దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి. 


- ఇచ్ఛాపురంలోని బెన్నుగానిపేట అంగన్‌వాడీ కేంద్రం భవనమిది. రూ.7లక్షల ఉపాధిహామీ నిధులతో పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటివరకూ కాంట్రాక్టర్‌కు రూపాయి చెల్లించలేదు. దీంతో ఇలా శ్లాబులెవల్‌లో పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించాలని కోరుతున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. 


- మెళియాపుట్టి మండలం నందవ అంగన్‌వాడీ భవనం ఇది. రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించలేదు. దీంతో దాదాపు నిర్మాణ పనులు పూర్తయినా.. భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు. 


జిల్లాలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు పడకేశాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. అటు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. పెండింగ్‌ పనులు పూర్తిచేయడం లేదు. ఫలితంగా అటు సిబ్బందికి, ఇటు చిన్నారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇరుకు గదుల్లో, పరాయి పంచన అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వానికి ఆద్దె రూపంలో అదనపు భారం పడుతోంది. జిల్లాలో 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,436 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. 1,09,839 మంది చిన్నారులు, 18,781 మంది గర్బిణులు, 17,398 మంది బాలింతలు ఉన్నారు. మొత్తం 3,436 కేంద్రాలకుగాను.. కేవలం 946 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 1,335 కేంద్రాలు అద్దె భవనాల్లోను, మరో 1,077 కేంద్రాలు వివిధ ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. 2017-18లో జిల్లాలో ఆర్‌ఐడీఎఫ్‌, జడ్పీ, ఏపీఐపీ, ఉపాధిహామీ పథకం నిధులతో 974 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా భవనాలు మంజూరయ్యాయి. వీటిలో నిర్మాణాలు ప్రారంభంకానివి 367, నిర్మాణం మధ్యలో అగిపోయినవి 224, నిర్మాణాలు పూర్తయినవి 383, ప్రభుత్వానికి అప్పగించినవి 238 ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ఇంకా అప్పగించనవి 145 వరకూ భవనాలు ఉన్నాయి. మరికొన్నింటికి స్థల సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. 


పరాయిపంచన..

సొంత భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరుకు గదులు, గుడిసెల్లో కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది. అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేకపోవడంతో నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు పౌష్టికాహారం, ఇటు ఆహార పదార్థాల తయారీ వంటి వాటి విషయంలో నిర్వాహకుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికైనా భవనాల పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. 


నివేదించాం

అసంపూర్తి భవనాలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించాం. పూర్తయిన భవనాలు కేంద్రాల నిర్వాహకులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటాం. స్థల సమస్య సైతం వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో పనులు పూర్తిచేస్తాం. 

- అనంతలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్‌, శ్రీకాకుళం.


బిల్లులు చెల్లించకే..

అంగన్‌వాడీ భవనాల నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తోంది. కానీ చాలామందికి బిల్లులు చెల్లించలేదు. అందుకే కాంట్రాక్టర్లు భవనాలు అప్పగించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.

- శాంతిభవాని, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, మెళియాపుట్టి సెక్టార్‌

Updated Date - 2022-08-19T04:00:48+05:30 IST