బిల్లులు ఇస్తారో లేదో!

ABN , First Publish Date - 2022-09-23T06:01:12+05:30 IST

జలజీవన మిషన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు.

బిల్లులు ఇస్తారో లేదో!

బిల్లులు ఇస్తారో లేదో!

జలజీవన మిషన టెండర్లకు స్పందన కరువు

కేంద్రం నిధులిచ్చినా.. 

రాష్ట్రం ఇవ్వదని భయం

ముందుకు సాగని 

ఇంటింటికి కొళాయి పనులు

జలజీవన మిషన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.  రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం పనులు చేపట్టడానికి ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి పైప్‌లైన, ఇంటింటికీ కొళాయి కనెక్షన ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 952 పనులకు రూ.102 కోట్లు కేటాయిచారు. ఈ పనులకు అనుమతి పొందారు. కానీ బిల్లులు ఇస్తారోలేదోనన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వ పనులకు ఎగబడిన కాంట్రాక్టర్లు, ఇప్పుడు టెండర్లు అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు. జలజీవన మిషన పనులకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుంది. మిగిలిన 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంత పెద్ద ఎత్తున నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితి లేదని, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. 

అనంతపురం న్యూటౌన


సీఈ స్థాయిలో పిలిచినా..

జలజీవన మిషన పనులను రెండు కేటగిరీలుగా విభజించి కేటాయించారు. 874 రెట్రోఫిట్టింగ్‌ పైప్‌లైన పనులకు రూ.75.7 కోట్లు కేటాయించారు. 78 ఆగ్మెంటేషన పనులకు రూ.27 కోట్లు కేటాయించారు. కేంద్రం నిధులు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా బిల్లులు మంజూ రు చేస్తుందా.. లేదా అన్న అనుమానాలు కాంట్రాక్టర్లలో ఉన్నాయి. స్థానికంగా అధికారులు టెండర్లను పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతారేమోనని సీఈ స్థాయిలో టెండర్లను పిలిచారు. అయినా పూర్తిస్థాయి ఫలితం కనిపించడం లేదని అధికార యంత్రాంగం అంటోంది. సీఈ పరిధి నుంచి నిర్వహించిన టెండర్లకు గుంతకల్లు, రాప్తాడు, శింగనమల, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లో స్పందన వచ్చిందని అధికార యంత్రాంగం అంటోంది. కొన్ని పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని చెబుతోంది. టెండర్లకు  కొందరు ముందుకొచ్చినా, పనులు ప్రారంభించేవరకూ కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది.


ముందుగానే పూర్తి చేయాలనుకున్నాం.. 

జిల్లాలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన ఇచ్చేలా జలజీవన మిషన ద్వారా చర్యలు చేపట్టాం. 2024 నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టారు. అయినా, 2023 నాటికే పూర్తి చేయాలని ప్రణాళిక తయారు చేసి అనుమతి తీసుకున్నాం. కానీ టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇబ్బందికరంగా ఉంది. అవే పనులకు సీఈ పరిధి నుంచి మరోసారి టెండర్లు పిలిచాము. జిల్లాలోని 5 నియోజవర్గాల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తి అయింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము.

- ఎహసాన బాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

Updated Date - 2022-09-23T06:01:12+05:30 IST