బిందువులో ఉప్పొంగే సముద్రం

ABN , First Publish Date - 2022-06-13T05:53:42+05:30 IST

మార్మిక కవులు ఎవరు, మార్మిక కవిత్వం ఏమిటి? - ఈ ప్రశ్నలు నన్ను చాన్నాళ్లుగా వేధిస్తూనే ఉన్నాయి. సాధారణంగా భక్తికవులైన సంత్‌లు, యోగులు, సూఫీలు, సిద్ధులు, బౌల్‌లు... మొదలైనవారు ఏ మతస్థులవారైనా...

బిందువులో ఉప్పొంగే సముద్రం

మార్మిక కవులు ఎవరు, మార్మిక కవిత్వం ఏమిటి? - ఈ ప్రశ్నలు నన్ను చాన్నాళ్లుగా వేధిస్తూనే ఉన్నాయి. సాధారణంగా భక్తికవులైన సంత్‌లు, యోగులు, సూఫీలు, సిద్ధులు, బౌల్‌లు... మొదలైనవారు ఏ మతస్థులవారైనా, వారందరినీ మార్మిక కవులుగానే పరిగణించారు. అంతేకాదు సాహిత్య పరంగా కవులకంటే కూడా ఎక్కువగా వారిని భావించారు. వారు తమ నిగూఢమైన ఆంతరంగిక ఆలోచనల్ని ప్రజలలోకి తీసుకుపోయారు. వారిలో ఎక్కువమంది పాట ద్వారా బోధనల ద్వారా మౌఖికంగానే తమ ఆలోచనల్ని వ్యాప్తి చేసారు. అవి రాతలో లేకపోయినా ప్రజల నాలుకలపై ఎన్నాళ్లైనా నిలిచాయి. మరికొన్ని ఆయా కవుల అను యాయులు, ఆ భావధారకు చెందిన అభ్యాసకులు, గురు శిష్య పరం పరల మూలంగా కూడా ప్రచారంలో ఉన్నాయి. అందులో పాటతో బాటు అంతర్లీనంగా ఉన్న కవిత్వం ఒక బలీయమైన పరిభాషగా, సందేశంగా, భావ వినిమయ సాధనంగా పనికివచ్చింది. 


ఉత్తర భారతదేశంలో సుగుణ భక్తి మూలంగా, దేవాలయాల్లోకి ప్రవేశం, పవిత్ర గ్రంథాలు పఠించడం, ఆచార నియమాలను పాటిం చడం లాంటివి అందరికీ తప్పనిసరి కాకపోవడంతో, ఎక్కువమంది అణగారిన వర్గాలకు ఆ యోగుల మార్మిక బోధనలు మరింత దగ్గర య్యాయి. దేవునికి సంబంధించి భావనల ప్రపంచంలోకి ఆ వర్గాలు ప్రవేశించగలిగాయి. ఆ యోగుల పాటల్లో లేదా కవితల్లో సామాన్యు లకు చెందిన అనేక అంశాలు (ఇల్లు, దారి, లక్ష్యం, కోరిక, సహవాసం, దుఃఖం, గురువు, సముద్రం, మరణం, స్తుతి, ప్రేమ మొదలైనవి) ఉండటంతో వాటివైపు వారు ఆకర్షితులయ్యారు.


తెలియకుండా తెలియనివాటికి దగ్గరయ్యే ఆధ్యాత్మిక అనుభవం మార్మికం. ఏదైనా సరే, ఎన్నటికీ తెలుసుకోలేనిది తెలుసుకోవాలన్న ఆసక్తిని అనంతంగా రేకెత్తిస్తూనే ఉంటుంది. ఆ తెలుసుకున్నదాన్ని, భాషలో వ్యక్తపరచగలిగే ప్రయత్నమే మార్మికం. మార్మిక కవిత్వం ప్రతీకాత్మకతలో వేళ్లూనుకొని ఉంటుంది. భావన, దాన్ని వివరించే భాష, ఆ మార్మిక మూలాల ప్రతీకల్ని సజీవం చేస్తాయి. వారు పొందిన చైతన్య స్థితిని భాషలో ఎరుకపరచడం దాదాపు అసాధ్యంగానే వారూ భావించారు. ఆ ఉన్నతమైన అను భవాన్ని, చంద్రుడిని వేలితో చూపించినట్టు, కొంతవరకు కవిత్వం ద్వారా చెప్పగలిగే ప్రయత్నం చేసారు. 


మార్మికులకు విశ్వం- గొప్ప సౌందర్యంతో, లోతైన పొరలు పొరలతో, సంపూర్ణంగా నిండిన అనంత రహస్యాలమయం. ‘ఎవరు వివరించ గలరు దానిని’ అని వారే తరచు చెప్పుకుంటారు. అయినా దానినే కవిత తరువాత కవిత, పాట తరువాత పాట, ఆశ్చర్యాలతో అన్వేషణలతో ఆవిష్కరణలతో అనేక విధాలుగా ప్రస్తావిస్తూనే ఉంటారు. దానిని సంశయంతో చూడరు, అందులోనే వారికి మౌలికమైన ఊరడింపు కనిపిస్తుంది. వారికి ‘అవును - కాదు’, ‘తప్పు - ఒప్పు’, ‘మనం - వారు’, ‘ఇటు - అటు’ల్లో మనస్సు పూర్తిగా ఆలోచనల, అభిప్రాయాల క్షేత్రమని తెలుసు. ఎరుక ఒక్కటే అందుకు చతురమైన యథార్థం అని, ఆ ఎరుక పదునైన కత్తిమొన లాంటిదని, దానిని దాటుకుంటూ పోవడం కష్టతరం అన్న గ్రహింపు వారికీ ఉంది. 


మార్మికులకు ఇల్లు అంటే వారి స్వగృహం కాదు; దేహం, హృదయం, విశ్వం అంతా వారి ఇల్లే. ‘‘గానం శబ్ద తీరాలకు నేను వెళ్లాను/ నాకు వాటి అలల్లో / అతని ఆకారమే ప్రతిఫలించింది/ నేను ఇంటిలోనే ఎలా ఉండిపోను’’ - అంటాడు కబీరు. ‘‘ఓ ఇల్లు లేనివాడా/ ప్రతీ కణంలో నువ్వుంటావు/ అన్ని స్థలాల్లో నువు నివసిస్తావు/ ..నేను నావికుడ్ని కలిసాను/ ఆ నావికుడి నావికుడివీ నువ్వే’’- అంటాడు సూఫీ రహీబ్‌.


దారీ పాటా ఒకదాన్నొకటి వారిని ఆవాహన చేసుకుంటుంటాయి. వారికి వారే కాదు; ఈ విశ్వంలో అందరూ యాత్రికులు, పరదేశీ యులు, దూరదేశీయులు, పక్షులు, హంసలు, భ్రమరాలు, బంజారాలు - ఇవన్నీ యాత్రని, అన్వేషణని, సంచారాన్నీ ఉద్దేశించినవే. అంతా వారికి రాకపోకల ఆట. మనం కోరుకోని ఇంకొక యాత్రకూడా వారికి ఉంటుంది, అది వీడ్కోలు, కడపటి సెలవు. ‘‘నిజమైన ఏడుపు లేకుండా ఏడ్వొద్దు/ నిజమైన గమనం లేకుండా నడవొద్దు/ నిజమైన అగ్ని లేకుండా కాల్చొద్దు/ వేడిలోను చలిలోనూ నడుస్తూనే ఉండు/ కాల యాపనకి సమయం లేదు’’ - అని గుర్తు చేస్తూనే ఉంటాడు ప్రముఖ సూఫీ కవి షా లతీఫ్‌. ‘‘అంతరాత్మ అనుభూతే సర్వోత్తమ దారి/ దృఢంగా రూఢిగా ఉండు/ వాస్తవం ఎలా ఉందో అలా చూస్తావు/ అసంఖ్యాకదారులు, అనంతంగా పుస్తకాలు/ చిన్ని పిచ్చుక అంతం లేకుండా తాగుతూనే ఉన్నా/ సముద్రం ఎన్నడూ ఎండిపోదు’’ - అంటాడు - జాదూ బిందూ బౌల్‌.


అంతర్‌ సత్యాన్ని వదిలి, బాహ్య ఆదేశాన్ని పాటించడం అపహాస్యంలా అనిపిస్తుంది వారికి. ఎప్పుడూ మార్పులేని, రూఢీ అయిన వాటినే మనస్సు విశ్వసిస్తుంది. నిర్ధారణలకు వస్తుంది. అప్పటి పరిస్థితులకు తలొగ్గుతుంది. ప్రతీ కాలంలోనూ మిథ్యాచారం ఛాందసత్వం రాజ్యమే లుతుంది. అందుకే మార్మికులు నిర్మొహమాటంగా ఘర్షణ భాషని వాడడానికి కూడా వెనకాడ లేదు. దైవత్వం లేదా సత్యం గురించి వారు పదేపదే చెప్తూనే పోయారు. అదే జీవితం వారికి, అదే ప్రేమ. ‘‘మునగడాలు సులువే/ పవిత్ర నదుల్లో చేపలు ఈదుతూనే ఉంటాయి/ అవి స్వర్గానికి పోతాయా?’’ - అని అడుగుతాడు భవానీ నాథ్‌. 


కారణాలు ఏవైనా దుఃఖం లేనిదెక్కడ. అనుభవించనిది ఎవరు? దుఃఖం ఉందన్న నిజాన్ని ఒప్పుకోకపోవడం వ్యర్థం. దుఃఖం ఎరుకనే కాదు, కారణాలనీ బయటకు తీస్తుంది, బయటపడటానికి మార్గాల్నీ వెతుకుతుంది. చింత ఒక రోగం అంటారు మార్మికులు. దానికేమన్నా చికిత్స ఉందా అని కూడా అడుగుతారు. ‘‘చింతని వదిలేసినా చింత ఎన్నడూ వదలదు/ అగ్ని నయం మృతుల్ని కాల్చేసి ఊరుకుంటుంది/ చింత సజీవుల్ని కాలుస్తూనే ఉంటుంది/ ప్రపంచంలో ఎవరినీ వదలదు/ ప్రాపంచిక చింతల్ని ఎలా వదిలించుకోవాలో అన్నదే చింతించు’’ - అంటాడు షొరోత్‌ బౌల్‌


రహస్యాన్ని తెలుసుకోవడం, రహస్యాన్ని రహస్యంగా ఉంచుకోవడం- అంతే కుతూహలంగా ఉంటుంది. అయితే ఎవరితోనూ పంచుకో కుండా ఉండటం కూడా సాధ్యమయే పని కాదు. తెలిసింది ఎంత ప్రామాణికమో తెలుసుకోవటానికీ అంతే ఆరాటం. అలా రహస్యంగా అది ఉండిపోదు. అయితే మార్మికులకు ఎంత మాత్రమూ అది నచ్చదు. దానిని మహా అయితే సూచనప్రాయంగా చెబుతారు. అర్థమయేవారికి అర్థమయేటట్టు. ‘‘ఆరాధన నదిలో మునుగు/ తృప్తి చెందేవరకూ అందులో ఈదు/ కానీ నీ దుస్తులు తడిచిపోకుండా చూసుకో’’ - అంటాడు రోషిక్‌ దాస్‌ బౌల్‌. రహస్యాన్ని బహిర్గతం చేయకుండా చెప్పే మార్గాలు మార్మికులకు అనేకం ఉన్నాయి. కబీర్‌ దానిని ‘ఉల్టా వాణి’ అని, అల్లమప్రభు ‘బెడగిన వచనాలు’ అని, మహాయాన బౌద్ధులు ‘సాంధ్యభాష’ అని చెప్పుకున్నారు. అలాంటి పేర్లేవీ పెట్టకున్నా, మార్మిక కవిత్వం రాసిన ఎందరో భక్తికవులు, యోగులు, సిద్ధులు, సూఫీలు, బౌల్‌లు, సంత్‌లు ఉన్నారు - అక్కమహాదేవి, ముక్తాబాయి, బసవన్న, తరిగొండ వెంగమాంబ, అరుణగిరినాథార్‌, లల్లా, అజన్‌ ఫకీర్‌ మొదలైనవారు.  


గురువుకు బారతదేశంలో అనాదిగా ఉన్న ప్రాముఖ్యత మరెక్కడా లేదు. గురువు ప్రత్యక్షంగా కనిపించేవాడైనా, కనిపించనివాడైనా సరే. యోగులకూ అంతే. గురువు మీద అచంచల నమ్మకం, గురువు కాపాడ తాడని, గమ్యానికి సరైన దారి చూపిస్తాడని, ఆవలి తీరానికి చేరు స్తాడని. ఆ నమ్మకంతోనే, శిష్యులకే తెలియని శక్తి సామర్థ్యాలతో ఆ శిష్యులు బయటపడటం చూస్తూ ఉంటాం. దానికోసం ఏ శ్రమకైనా శిష్యులూ సిద్ధంగా ఉంటారు. విత్తనంలో నూనెలా, కట్టెలో అగ్గిలా, పాలలో నెయ్యిలా, పదంలో అర్థం, వస్తువులో పదార్థం, స్వరంలో శ్రావ్యత, తెలియనివి తెలిసేట్టు, చూడనివి చూసేట్టు గురువు చేస్తాడన్న ఆ శిష్యుల నమ్మకాన్ని ఎవరూ మార్చలేరు. 


అరచేతుల్లో నుంచి నీరు జారిపోతున్నట్టు జీవితం జారిపోతుంది. వ్యాకుల వార్థక్యం ఎదురు చూస్తూనే ఉంటుంది. సహనం పోతుంది. అలా జరగకముందే నమ్మినవారిని తలుచుకో, మనసారా ఎన్ని పేర్లతో నైనా కీర్తించు అంటారు మార్మికులు. వారికి సముద్రం ఇంకొక రూపకం. జీవితాన్ని భవసాగరం అంటారు. ‘‘అలల్ని అనుభవించు/ ముత్యాలు బురదగుంటల్లో దొరకవు’’- అంటారు. మరణానికి ముందే మరణించ మంటారు. ఎవరు మరణిస్తారు? అంతకుముందు ఎవరు బ్రతికి ఉన్నారు? ఎవరు ఉండిపోతారు ఆ తరువాత? - అన్నీ ప్రశ్నలే మనస్సుకి. యోగులకు ఆ ఇబ్బంది ఉండదేమో. ముగిసిన బంధనాలను పూడ్చేయ టానికి, అసమ్మతంగానైనా స్మశానాలకు వెళ్లకుండా ఉండలేము. మరణం కేవలం భౌతికం కాదు. మరణానికి ముందు ఎన్ని మరణాలో!


తాము కోరుకునే దేశాన్ని నగరాన్ని మార్మికులు ఊహిస్తారు అనే  కంటే ఆశిస్తారు అనడం బాగుంటుంది. ప్రముఖ దళిత యోగి రైదాస్‌ ‘బేగంపురా (దుఃఖరహిత నగరం)’ అన్న గొప్ప కవిత రాసాడు. అలాగే లాలన్‌ ఫకీర్‌ అద్దాల నగరం అన్న కవిత కూడా. ‘‘ఇక్కడి రాయి, అక్కడి రాయి అవన్నీ ఒకటే/ ఆ ప్రవీణుడే రెంటినీ సృష్టించాడు/ ఇక్కడి రాయి విగ్రహ భాగం అవుతుంది/ అక్కడ అది గుడిలోని నేల - చూసే వాటిలో తేడా తప్ప భేదభావాలు ఉండకూడ’’దంటాడు గోరఖ్‌ నాథ్‌. మార్మికుల స్థితిని మామూలు మాటల్లో చెప్పలేము. కానీ వారి కవితలు, పాటలు చెప్పలేని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాయి. ‘‘చంద్రుడు లేడు, సూర్యుడు లేడు/ అయినా వెలుగు ఉంది/ మరో ప్రపంచానికి పోకు/ నీకు కావలిసినదేదో ఇక్కడే ఉంది/ ...మూగ పాడటం మొదలెట్టాడు/ చెవిటి వినగలడు/ కుంటి నర్తిస్తున్నాడు/ గుడ్డి చూస్తు న్నాడు’’ - అని ఆ స్థితిని రకరకాలుగా చెబుతాడు భవానీ నాథ్‌. 


మార్మికులు మాటాడే ప్రేమ పరమ విస్తృత మైనది. అంతా ప్రేమే. అన్నీ ప్రేమ కోసమే. ప్రేమే విముక్తి కల్పిస్తుంది. ‘‘ఈ నా శరీరం, అతని మనస్సు/ రెండూ ఒకే వర్ణమయ్యాయి/ ...ఈ ప్రేమ ఆటలో/ నేను గెలిస్తే అతను నా వాడు/ నేను ఓడితే అతని వాడిని నేను/ ..ఈ ప్రేమ నదిలో/ తప్పించుకుంటే కొట్టుకుపోతాం/ కొట్టుకుపోతే రక్షింపబడతాం’’ -అంటాడు సూఫీ కవి అమీర్‌ ఖుస్రో. ‘‘ప్రేమలో/ దీపం చుట్టూ తిరుగుతూ దాని శరీరాన్ని అర్పించే/ చిమ్మటవు కా/ .../చంద్రుని ప్రేమలో/ సముద్రంతో వేరయి ప్రాణం కోల్పోయే/ చేపవు కా/ మూసుకుంటున్న కమలం రెక్కల్లో ఇరుక్కుపోయిన/ తుమ్మెదవు కా’’ - అంటుంది మీరాబాయి 


తెలుగులో వేమన రాసిన మార్మికపద్యాలను, కొందరు అచల తత్వానికి చెందినవి అన్నారు. ‘‘నీరు కారమాయె కారంబు నీరాయె/ కారమైన నీరు కారమాయె/ కారమందు నీరు కడు రమ్యమైయుండు’’ -లాంటివి. వీరబ్రహ్మంతో బాటు, వారివీ వారి శిష్యుల తత్వాలు, కొంత వరకు వీరకాళికాంబ పద్యాలు, ప్రతీకలతో ఈ కోవకే చెందుతాయి. ‘‘మొదలు మీదుగ తలలు క్రిందుగ/ మొలచి యున్నది వృక్షము/ మొదలు ఒక్కటి/ పెక్కు కొమ్మలురా/ ఎక్కిచూచిన ఎంతో పొడుగు/ ఆకాశం బంటినదిరా’’- అంటాడు వీరబ్రహ్మం ఒక తత్వంలో.


జీవితంలో సామాన్యులకు అందని, అతీత అనుభవాలతో ముడిపడిన ఒక రహస్య ఆధ్యాత్మిక పరిపక్వత మార్మిక కవిత్వం. వివిధ రకాలైన ఆధ్యాత్మిక సాధనల ద్వారా తన గురించి తాను నిగూఢమైన రహస్యాలు తెలుసుకోవడం, తద్వారా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం మార్మిక వాదం. ఇక్కడ మార్మికత అంటే పంచేంద్రియాలతో అవగాహన చేసు కోవడానికి వీలుకాని జీవితమనే అద్భుతాన్ని విశిష్టంగా శోధించడం. ‘‘చూసినవారు పూర్తిగా నమ్ముతారు/ చూడనివారికి ఎన్నటికీ చెప్ప లేము/.. కాళ్లులేకుండా నేను కొండెక్కాను/ ఇతరులకు ఎక్కడం కష్టమయింది/ కాళ్లుపెట్టకుండా సముద్రంలో ఈదాను/ నా ఆత్మ అందులో ఈడ్చింది, నా హృదయం కావాలంది/’’ - అని చెబుతాడు మరో ప్రముఖ సూఫీ కవి ఆల్‌ హల్లజ్‌. పశ్చిమంలో 16వ శతాబ్దంలో క్రైస్తవం ద్వారా మాత్రమే వెలుగుచూసిన మార్మిక కవిత్వం, భారత దేశంలో కవిత్వపరంగా చెప్పిన యోగుల భక్తి సంవేదనలు, మార్మిక అనుభవాల రూపంలో వేదకాలంనుంచీ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మార్మిక కవిత్వం రాసినవారు ఉన్నారు. అందరికీ తెలిసిన నోబెల్‌ బహుమతి పొందిన రవీంద్రుని గీతాంజలి మార్మిక కవిత్వం గురించి తెలియనివారు ఉండరు. ‘‘అది యోగుల దైవానుభవం. కవిత్వంలో నిగూఢంగా, అరుదుగా, నిర్మలంగా వారి నుండి బయట కొస్తుంది. పరిపూర్ణతను చేరుకోవాలని, అక్కడితో ఆగకుండా దానికి ఒక సరికొత్త చూపును ప్రసాదించాలని ఆ యోగులు ఎడతెగకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు,’’ అని మార్మికుల్లో మార్మికుడుగా గుర్తించబడిన అరవిందుడు అంటాడు. 

ముకుంద రామారావు

99083 47273

Updated Date - 2022-06-13T05:53:42+05:30 IST