చికెన్‌ వ్యర్థాలతో బయో డీజిల్‌

ABN , First Publish Date - 2021-07-26T06:40:42+05:30 IST

ఇంధన కొరత పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో భారత్‌లో కీలక ఆవిష్కరణ జరిగింది. కోళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానం లో, కోడి మాంసం వినియోగంలో రెండో స్థానంలో ఉన్న మన దేశానికి దన్నుగా నిలిచే సరికొత్త...

చికెన్‌ వ్యర్థాలతో బయో డీజిల్‌

  • కేరళ పశు వైద్యుడు జాన్‌ అబ్రహం 
  • అభివృద్ధిచేసిన పరిజ్ఞానానికి పేటెంట్లు 
  • 100 కేజీల చికెన్‌ వ్యర్థాలతో 1లీటరు 
  • లీటరు ధర 60 రూపాయల్లోపే
  • లీటరు డీజిల్‌తో కార్ల మైలేజీ 38 కి.మీ  

వయనాడ్‌, జూలై 25: ఇంధన కొరత పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో భారత్‌లో కీలక ఆవిష్కరణ జరిగింది. కోళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానం లో, కోడి మాంసం వినియోగంలో రెండో స్థానంలో ఉన్న మన దేశానికి దన్నుగా నిలిచే సరికొత్త పరిజ్ఞానాన్ని కేరళకు చెందిన పశు వైద్యుడు జాన్‌ అబ్రహం ఆవిష్కరించారు. చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారుచేసేందుకు ఆయన అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు మం జూరు చేసింది. ఈ మేరకు పేటెంట్ల జారీ కార్యాలయం నుంచి జూలై 7న ఆయనకు ధ్రువీకరణ లభించింది. డాక్టర్‌ జాన్‌ అబ్రహం ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ జిల్లా పుకొడ్‌ వెటర్నరీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. తమిళనాడులోని నమక్కల్‌ వెటర్నరీ కళాశాలలో డాక్టోరల్‌ రిసెర్చ్‌ చేస్తుండగా చికెన్‌ వ్యర్థాలనుంచి బయో డీజిల్‌ను తయారుచేసే పరిజ్ఞానాన్ని ఆయన అభివృద్ధి చేశారు. 2014లోనే పేటెంట్ల కోసం తమిళనాడు వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ వర్సిటీ తరఫున దరఖాస్తు సమర్పించగా ఇప్పుడు ఆమోదం లభించింది. 2014లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) అందించిన రూ.18 లక్షలతో పాటు పుకొడ్‌ వెటర్నరీ కళాశాల క్యాంప్‌సలోనే పైలట్‌ ప్రాజెక్టు ప్రాతిపదికన చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారుచేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2015 ఏప్రిల్‌లోనే కొచ్చిలోని భారత్‌ పెట్రోలియం రిఫైనరీ నిపుణులు తమ ప్లాంట్‌ను సందర్శించి, బయో డీజిల్‌ నాణ్యతను ధ్రువీకరించారని చెప్పారు. నాటి నుంచి పుకొడ్‌ వెటర్నరీ కళాశాలకు చెందిన ఒక వాహనాన్ని ఈ ఇంధనంతోనే నడుపుతున్నామన్నారు.


ముఖ్య అంశాలివీ.. 

  1. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 100 కేజీల చికెన్‌ వ్యర్థాలను కేజీకి రూ.7 చొప్పున కొనుగోలు చేశారు. 
  2. 100 కేజీల చికెన్‌ వ్యర్థాల నుంచి ఒక లీటరు బయో డీజిల్‌ ఉత్పత్తి అయింది. దీన్ని మార్కెట్లో లీటరుకు రూ.59 చొప్పున విక్రయించొచ్చు.  
  3. డీజిల్‌ లీటరు ధర (రూ.97.96) కంటే 40శాతం తక్కువ రేటుకే (దాదాపు రూ.59) ఇది లభ్యమవుతుంది. 
  4. ఒక లీటరు బయోడీజిల్‌తో కార్లలో 38 కిలోమీటర్లకుపైగా మైలేజీ వస్తుంది. 
  5. పాత తరం డీజిల్‌ ఇంజిన్లు గల కార్ల కోసం డీజిల్‌లో దీన్ని 80:20 నిష్పత్తి లో, కొత్త సీడీఆర్‌ఈఐ ఇంజిన్ల కోసం 20:80 నిష్పత్తిలో కలపొచ్చు. 
  6. ఈ ఇంధనం వాడకంతో వాహనాల ద్వారా జరిగే వాయు కాలుష్యం సగానికి సగం తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం చికెన్‌ వ్యర్థాల్లో 6శాతం మేర కొవ్వు ఉండటమే. 

Updated Date - 2021-07-26T06:40:42+05:30 IST