Bio Metric.. నో వర్క్‌.. డ్యూటీకి వచ్చినా జీతాల్లో కోత.. అసలెందుకిలా..!?

ABN , First Publish Date - 2022-05-26T16:37:10+05:30 IST

జీహెచ్‌ఎంసీలో (GHMC) పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్‌ (Bio Metric) హాజరు (Attendence) వివాదాస్పదమవుతోంది..

Bio Metric.. నో వర్క్‌.. డ్యూటీకి వచ్చినా జీతాల్లో కోత.. అసలెందుకిలా..!?

  • సాంకేతిక సమస్యలతో పని చేయని యంత్రాలు
  • గైర్హాజరుగా నమోదవుతోందని కార్మికుల ఆందోళన
  • పనులు చేసేది లేదని స్పష్టం చేసిన వైనం
  • ఉన్నతాధికారులు, కార్పొరేటర్ల జోక్యంతో విధుల్లోకి..

హైదరాబాద్‌ సిటీ/చిక్కడపల్లి : జీహెచ్‌ఎంసీలో (GHMC) పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్‌ (Bio Metric) హాజరు (Attendence) వివాదాస్పదమవుతోంది. విధులకు హాజరైనా వేతనాల్లో కోత విధిస్తున్నారని కార్మికులు (GHMC Workers) ఆరోపిస్తుంటే.. సకాలంలో ఎస్‌ఎఫ్‌ఏలు హాజరు తీసుకోకపోవడం వల్లే సమస్య తలెత్తుతోందని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. బుధవారం గ్రేటర్‌లోని దాదాపు అన్ని సర్కిళ్లలో ఉదయం బయోమెట్రిక్‌ యంత్రాలు పని చేయలేదు. దీంతో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, బాగ్‌ అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో కార్మికులు నిరసనకు దిగారు. అన్యాయంగా జీతాలు కట్‌ చేస్తున్నారు.. పని చేసేది లేదని తేల్చి చెప్పారు. సాంకేతిక సమస్యతో యంత్రాలు పని చేయడం లేదని గుర్తించిన ఉన్నతాధికారులు మధ్యాహ్నం హాజరును ఉదయానికి వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరులోని (Bangalore) యూఏడీఐ సర్వర్‌లో సమస్యను పరిష్కరించేలా చర్చించి.. రెండో విడత హాజరు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, ఇతర నేతలు జోక్యం చేసుకొని కార్మికులకు సర్ది చెప్పారు.


గ్రేటర్‌లో 18వేల మందికిపైగా కార్మికులున్నారు.  నిత్యం 14 వేల మంది విధులకు హాజరవుతారు. 2200 మంది వీకా‌ఫ్‌లో ఉండగా, మరో 1500-2000 మంది సెలవుపై వెళ్తారు. బుధవారం మధ్యాహ్నం హాజరు సమయంలో 14 వేల మంది విధుల్లో ఉన్నారని, వారందరికీ హాజరుగా పరిగణిస్తామని ఐటీ విభాగం అదనపు కమిషనర్‌ జయరాజ్‌ కెనడి తెలిపారు.


మారిన నిబంధనలు..

కొన్నేళ్లుగా బయోమెట్రిక్‌ హాజరు విధానం అందుబాటులో ఉన్నా ఇటీవలే వివాదం మొదలైంది. యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, సకాలంలో హాజరు తీసుకోకపోవడం, కొందరు కార్మికుల వేలిముద్రలు గుర్తించక పోవడమే కారణాలుగా తెలుస్తోంది. పని చేయని యంత్రాల స్థానంలో సర్కిళ్ల వారీగా ఐదు స్పేర్‌ యంత్రాలు అందుబాటులో ఉంచినట్టు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. గతంలోనూ ఉదయం 6 గంటల్లోపు హాజరు తీసుకోవాలనే నిబంధన ఉండేది. నిర్ణీత సమయం దాటిన అనంతరం కార్మికుల ఫొటో తీసి సంబంధిత గ్రూపులో పోస్ట్‌ చేస్తే నాట్‌ అథెంటికేటేడ్‌(ఎన్‌ఏ)గా పరిగణించి హాజరు వేసేవారు. నిర్ణీత గంటలు పని చేయకుండా కొందరు కార్మికులు ఏదో సమయంలో వచ్చి ఎన్‌ఏగా హాజరు వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.


వారికి ఎస్‌ఎఫ్ఏలు సహకరించే వారు. ఇందుకుగాను కొందరు కార్మికుల వేతనంలో రూ.1000 నుంచి రూ.2000 ప్రతి నెలా కప్పం కట్టాల్సి వచ్చేది. ఒక్కో గ్రూప్‌ నుంచి రూ.3500 నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తారని ప్రచారం. ఇందులో నుంచి కొందరు ఏఎంఓహెచ్‌లు, డీసీలు, జోనల్‌ కమిషనర్ల వరకు వాటాలు వెళ్తాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని సర్కిళ్లలో ఏఎంఓహెచ్‌ల స్థానంలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తోన్న డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు(డీఈఈ) ఇదే బాటలో నడుస్తున్నారు. బయోమెట్రిక్‌ హాజరు ప్రామాణికంగా వేతనాలు చెల్లిస్తే.. తమ ఆదాయానికి గండి పడుతుందన్న ఉద్దేశంతో తెర వెనకుండి కొందరు కార్మికులను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఎన్‌ఏలు క్రమేణా పెరుగుతుండడం.. క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సకాలంలో హాజరు ప్రారంభించని ఎస్‌ఎఫ్ఏలను తొలగించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏఎంఓహెచ్‌/డీఈఈ, డీసీలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, మాతృ సంస్థలకు సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు ఆలస్యంగా వస్తుండడమూ గైర్హాజరుకు కారణం.


పైసా రావడం లేదు : ఓ జెడ్‌సీ ఆవేదన

‘బయో మెట్రిక్‌తో పారిశుధ్య కార్మికుల హాజరు తీసుకుంటున్నారు. భవనాల వద్దకు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు వెళ్లొద్దని ఆదేశించారు. టీఎస్‌బీపాస్‌లో ఆటోమేటిక్‌గా నిర్మాణ అనుమతులు జారీ అవుతున్నాయి. ఇంజనీరింగ్‌ పనులకు సంబంధించి బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక అదనపు ఆదాయం ఎక్కడిది’ ఇది తనను కలిసిన వారితో జీహెచ్‌ఎంసీలోని ఓ జోనల్‌ కమిషనర్‌ ఆవేదన. పారిశుధ్య కార్మికుల హాజరు నుంచి భవనాల అనుమతి వరకు విభాగాల వారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచడం పలు సర్కిళ్లు, జోన్లలో సాధారణం. ఇటీవలి నిర్ణయాలతో అదనపు ఆదాయం తగ్గిందని భావిస్తోన్న ఉన్నతాధికారులు.. కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.


గతంలోనూ..

మెరుగైన పారిశుధ్య నిర్వహణలో భాగంగా బయోమెట్రిక్‌ హాజరును పకడ్బందీగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. రోజూ రెండు పర్యాయాలు హాజరు తీసుకోవాలని, దాని ఆధారంగానే వేతనాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు (సాధారణ రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు) హాజరు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే రెండు, మూడు నెలలుగా వేతనాలు చెల్లిస్తున్నారు. దీంతో చాలా మంది కార్మికుల వేతనాల్లో కోత పడుతోంది. 


వచ్చే రూ.14 వేలలో రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు కట్‌ చేస్తున్నారు. విధులకు వచ్చినా వేతనాల్లో కోత ఏంటని కార్మికులు ప్రశ్నిస్తుంటే, హాజరు ఆధారంగానే వేతనాలిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ లోపం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. జీహెచ్‌ఎంసీలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని విఫలం చేసే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. బోగస్‌ కార్మికులు, విధులకు రాని వారికీ హాజరు వేయడం పరిపాటిగా మారింది. కాగితాల్లో కార్మికులుగా ఉండే పలువురు శానిటరీ సూపర్‌వైజర్‌ (ఎస్‌ఎస్)లు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎఫ్ఏ)ల బంధువులకు ఫొటోల ఆధారంగా హాజరు వేయడం పరిపాటిగా మారింది.

Updated Date - 2022-05-26T16:37:10+05:30 IST