బయో మైనింగ్‌

ABN , First Publish Date - 2022-08-06T06:05:07+05:30 IST

కుతుబ్‌షాహీల కాలంలో పురుడు పోసుకున్న హైదరాబాద్‌ నగరం.. అస్‌ఫజాహీలతో బైరూనీ(మూసీ బయట) హైదరాబాద్‌గా..

బయో మైనింగ్‌

జవహర్‌నగర్‌ చెత్త సమస్యకు పరిష్కారంగా తెరపైకి..

ఇప్పటి వరకు క్యాపింగ్‌ పద్ధతి     

ఇందుకోసం  రూ.140 కోట్ల ఖర్చు

క్యాపింగ్‌ సరికాదన్న జాతీయ  హరిత ధర్మాసనం  

బయో మైనింగ్‌పై అధ్యయనానికి ఆదేశం

జీహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచినా.. స్పందన కరువు  

ఐఐటీ-బాంబే ప్రొఫెసర్లకు బాధ్యతలు

రూ. 1.90 కోట్ల  చెల్లింపులు  

15 నెలల్లో సమగ్ర నివేదిక ఇచ్చేలా ఒప్పందం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కుతుబ్‌షాహీల కాలంలో పురుడు పోసుకున్న హైదరాబాద్‌ నగరం.. అస్‌ఫజాహీలతో బైరూనీ(మూసీ బయట) హైదరాబాద్‌గా.. ఆ తర్వాత లష్కర్‌(సికింద్రాబాద్‌) నిర్మాణంతో మరింతగా విస్తరించింది. సైబరాబాద్‌గా విస్తరించి, ఏ1 సిటీగా ఎదిగి.. విశ్వనగరంగా దూసుకుపోతోంది. అయితే.. నగర విస్తరణతోపాటే.. చెత్త సమస్య కూడా పెరిగింది. ఒకప్పుడు హైదరాబాద్‌ జిల్లాకే పరిమితమైన సమస్య.. ఇప్పుడు శివారు జిల్లాలకూ వ్యాపించింది. ఫలితంగా  రోజూ ఉత్పత్తి అవుతున్న సుమారు 6,300 మెట్రిక్‌ టన్నుల చెత్త నిర్వహణ ఓ సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నెన్నో ప్రత్యామ్నాయాలను అమలు చేసిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఇప్పుడు బయో మైనింగ్‌పై దృష్టిసారించింది.

రూ.140 కోట్లతో క్యాపింగ్‌...

మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)గా ఉన్నప్పుడు తూర్పున ఆటోనగర్‌, పశ్చిమాన గంధంగూడలో చెత్తడంపింగ్‌ యార్డులు ఉండేవి. 2002లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం కాకుండా, లేయర్ల ఏర్పాటుపై అధ్యయనం జరిగింది. కానీ.. హైదరాబాద్‌కు ఆనుకుని శివార్లలో కొనసాగిన 12 మునిసిపాలిటీల విలీనంతో జీహెచ్‌ఎంసీ ఆవిర్భవించింది. ఆ తర్వాత.. చెత్తడంపింగ్‌ జవహర్‌నగర్‌కు మారింది. నిజానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జవహార్‌నగర్‌లోని 339 ఎకరాల స్థలాన్ని డంపింగ్‌ యార్డు కోసం కేటాయించింది. అయితే.. పరిసర మునిసిపాలిటీల చెత్తను మాత్రమే అక్కడ డంప్‌ చేసేవారు. జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం తర్వాత.. గంధంగూడ, ఆటోనగర్‌ డంపింగ్‌యార్డులకు స్వస్తిపలికి.. జవహర్‌నగర్‌కు చెత్తను తరలించడం ప్రారంభించారు. ఇక్కడ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, నిల్వకు ఓ ప్రైవేటు సంస్థతో 2009లో జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నా.. ఆ ప్రక్రియ అమలు 2012 నుంచి ప్రారంభమైంది. కానీ, అప్పటికే 125 ఎకరాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. అప్పటి వరకు చేసిన డంపింగ్‌ను అలాగే వదిలి, ఆ తర్వాత సేకరించిన చెత్త విషయంలో మాత్రమే ఆ పద్ధతిని అమలుచేసింది. దీంతో.. అంతకు ముందు అశాస్త్రీయంగా చేసిన డంపింగ్‌తో దుర్వాసన రావడం, వర్షాలు పడ్డప్పుడు హానికరమైన వాయువులు(లీచెట్‌) వస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు చెత్తలారీల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో.. క్యాపింగ్‌ పద్ధతివైపు జీహెచ్‌ఎంసీ మొగ్గుచూపింది. అప్పటి వరకు డంప్‌ అయిన మొత్తం చెత్త  పైనుంచి క్యాప్‌ చేశారు. ఇందుకు రూ. 140 కోట్లను వెచ్చించారు. క్యాపింగ్‌ వల్ల దుర్వాసనలు, వర్షం సమయంలో లీచెట్‌ బయటకు రావు. అయితే.. ఈ ప్రక్రియపై జాతీయ హరిత ధర్మాసనం(ఎన్‌జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. బయో మైనింగ్‌ ఒక్కటే పరిష్కారమని, ఆ దిశలో అధ్యయనం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

రంగంలోకి ఐఐటీ-బాంబే ప్రొఫెసర్లు

ఇప్పటికే ఈ తరహాలో బయో మైనింగ్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థలు, కంపెనీలపై జీహెచ్‌ఎంసీ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఐఐటీ-బాంబే ప్రొఫెసర్లు ఢిల్లీ మహానగరంలో చెత్త మైనింగ్‌పై అధ్యయనం చేస్తున్నట్లు గుర్తించింది. దాంతో వారితోనే ఒప్పందానికి సిద్ధపడింది. ఈ అధ్యయనానికి రూ. 1.90 కోట్లను వారికి అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. 15 నెలల్లో ఐఐటీ-బాంబే ప్రొఫెసర్లు సమగ్ర నివేదికను అందజేయాలని ఆ ఎంవోయూలో స్పష్టం చేసింది. వారు త్వరలో జవహర్‌నగర్‌కు వచ్చి.. ఇక్కడ బయోమైనింగ్‌కు అవకాశాలున్నాయా? లేదా? ఒకవేళ క్యాపింగ్‌ అయిన చెత్త(దశాబ్దన్నరగా పేరుకుపోయింది)ను తవ్వితే పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా మారుతాయా? పర్యావరణంపై దుష్ప్రభావం పడుతుందా..? అనే కోణాల్లో నివేదికను అందజేస్తారు. బయో మైనింగ్‌కు అయ్యే ఖర్చు అంచనాలు.. పునర్వినియోగంతో కలిగే లాభాలపై.. దాని ద్వారా కలిగే ఆదాయ మార్గాలపై సమగ్ర నివేదికను ఇస్తారు. ఆ నివేదికను బట్టి.. జీహెచ్‌ఎంసీ తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది.

ఏమిటీ బయో మైనింగ్‌?

డంపింగ్‌ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తోడి.. వేర్వేరు పనులకు ఉపయోగించడమే బయో మైనింగ్‌. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తలోంచి తడి భాగంతో సేంద్రీయ ఎరువులను, పొడి భాగంతో విద్యుదుత్పత్తి, రీసైక్లింగ్‌ ద్వారా ఇతర అవసరాలకు వినియోగించేలా ఏర్పాటు చేస్తారు. ఈ రెండు ప్రక్రియలకు అవసరం రాకుండా మిగిలిపోయిన చెత్తను మాత్రమే శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పాతిపెడతారు. దీనివల్ల చెత్త పునర్వినియోగం జరగడమేకాకుండా.. తక్కువ స్థలంలో డంపింగ్‌కు వీలుంటుంది. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో పేరుకుపోయిన వేల టన్నుల చెత్తను ఈ ప్రక్రియలో పునర్వినియోగించే అవకాశాలుంటాయి. అయితే.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రూ. కోట్లు వెచ్చించి, రూ. వేలల్లో మాత్రమే లబ్ధి కలిగే చర్యలను నిలువరించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. దీంతో.. జవహర్‌నగర్‌ నుంచి ఎంతమేర చెత్త పునర్వినియోగానికి ఉపయోగపడుతుంది? ఎంత స్థలం ఆదా అవుతుంది? అనే అంశాలపై అధ్యయనానికి సిద్ధమైంది. అయితే.. ఈ అధ్యయనం కోసం జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించినా.. స్పందన కరువైంది. దీంతో.. ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారించింది.

తరలింపునకు ప్రజా ఉద్యమం : దుబ్బాక ఎమ్మెల్యే 

జవహర్‌నగర్‌, ఆగస్టు 5 : జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు తరలింపునకు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం డంపింగ్‌ యార్డును, దాని ప్రభావానికి గురవుతున్న ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. సమీపంలోని 70 కాలనీల్లో లక్షల మంది డంపింగ్‌ యార్డు వద్ద ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

Updated Date - 2022-08-06T06:05:07+05:30 IST