బయో స్కాం!

ABN , First Publish Date - 2021-07-27T05:56:24+05:30 IST

విత్తనం మొదలుకొని పిచికారీ చేసే పురుగు మందుల వరకు అంతా కల్తీమయంగానే మారిపోవడంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇన్నాళ్లు బీటీ-3 లూ జు విత్తనాలు, నకిలీసోయా, పత్తి విత్తనాలతో నిం డా మునిగిన జిల్లా రైతులు ప్రస్తుతం అనుమతిలేని బయోరసాయన పురుగు మందులతో వ్యాపారుల చేతిలో మళ్లీ మోసపోతున్నారు.

బయో స్కాం!

బేల మండలంలో విచ్చలవిడిగా అనుమతి లేని బయోమందుల విక్రయాలు 

టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన వైనం 

బయోమందుల వ్యవహారంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నేత హస్తం 

కోర్టు స్టే పేరిట కేసులు చేసేందుకు కాలయాపన 

వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు

ఆదిలాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): విత్తనం మొదలుకొని పిచికారీ చేసే పురుగు మందుల వరకు అంతా కల్తీమయంగానే మారిపోవడంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇన్నాళ్లు బీటీ-3 లూ జు విత్తనాలు, నకిలీసోయా, పత్తి విత్తనాలతో  నిం డా మునిగిన జిల్లా రైతులు ప్రస్తుతం అనుమతిలేని బయోరసాయన పురుగు మందులతో వ్యాపారుల చేతిలో మళ్లీ మోసపోతున్నారు. బయోమందులను పంటలపై పిచికారీ చేస్తే పంటలు ఏపుగా పెరుగుతాయంటూ నమ్మబలుకుతూ రైతులకు అంటగడుతున్నారు. ఈ మందుల అమ్మకాలతో అధిక లాభాలు రావడంతో వ్యాపారులు బయోమందుల విక్రయా లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రైతులకు మాయమాటలు చెబుతూ బయోమందులను విక్రయి స్తూ అందినకాడికిదండుకుంటున్నారు. వారం రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బేల మండలంలో ఆకస్మికంగా దాడులు చేసి అనుమతులు లేకుండా బయోమందులను తయారు చేస్తున్న ఓ వ్యాపారి ఇంటిపై దాడి చేసి రూ.10.53లక్షల విలువ గల మందులను స్వాధీనం చేసుకుని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. అనుమతి లేకుండా ఇంట్లోనే పురుగు మందులను తయారు చేస్తున్నారన్న కారణంగా బేల మండలానికి చెందిన మాన్కర్‌మోహన్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ బేల మండల కేంద్రంగానే మహారాష్ట్రతో పాటు జిల్లా వ్యాప్తంగా బయోమందుల అమ్మకాలు జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు కదిలినట్లే కనిపించడం లేదు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసేంత వరకు వ్యవసాయ అధికారులకు బయోమందుల సమాచారం తెలియక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు నెలవారి మామూళ్లతోనే వ్యాపారులు వ్యవసాయ శాఖ అధికారుల కళ్లు మూయించినా.. టాస్క్‌ఫోర్స్‌ దాడులతో గుట్టురట్టయింది. వారం రోజులు గడుస్తున్నా మిగతా వ్యాపారులపై కేసులు నమోదు చేయక పోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అధికారులకే స్పష్టత లేదు..

బయోమందుల అమ్మకాలపై వ్యవసాయ శాఖ అధికారులకే స్పష్టత లేకుండా పోయింది. ఈ మందుల విక్రయాలపై జోక్యం చేసుకోకూడదనే హైకోర్టు స్టే ఉందని చెబుతున్న అధికారులు అందులో ఏముందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బేల మండల కేంద్రంలో అనుమతి లేకుండా ఇంట్లోనే బయోమందులను తయారు చేస్తున్నట్లు ఒకరిపై కేసు నమోదు చేసిన అధికారులు మండల కేంద్రంలోని అడనేశ్వర్‌, తాతావార్‌, శ్రీవెంకటేశ్వర సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ దుకాణాల పై దాడులు చేసి సుమారుగా 2లక్షల 50వేల విలువ గల బయోమందులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ దుకాణాల యజమానులపై కేసులు చేయకుండానే వదిలేశారు. బయోమందుల విక్రయాలలో జోక్యం చేసుకోరాదని హైకోర్టు స్టే ఉందంటూ చెబుతున్న అధికారులు మరి 2లక్షల 50వేల విలువ గల బయో పురుగు మందులను ఎందుకు స్వాధీనం చేసుకున్నారో అధికారులకే తెలియాలి మరి. బయోమందులకు అనుమతులు లేవని చెబుతునే వాటి అమ్మకాలకు పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేదన్న సాకుతో నెల నెలా కొందరు అధికారులు వసూళ్లకు ఎగబడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు చెబుతున్న తీరును చూస్తు ంటే ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.

అధికారులపై టీఆర్‌ఎస్‌ నేత ఒత్తిడి..

బయోమందుల అమ్మకాల్లో స్థానిక టీఆర్‌ఎస్‌ నేత హస్తం ఉండడం పోలీసుల దాడుల్లో ఆ నేతకు సంబంధించిన ఫర్టిలైజర్‌ దుకాణంలో బయోమందులు దొరకడంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. బయటకు కోర్టు స్టే ఉందని చెబుతున్న అధికారులు అధికార పార్టీ నేత ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే విమర్శలున్నాయి. స్థానిక మండల ఏవో బయోమందుల విక్రయాలు, స్వాధీనం చేసుకున్న బయోమందులపై ఇప్పటికే పై అధికారులకు నివేదిక ఇచ్చినా దానిని తొక్కిపెడుతున్నట్లు తెలుస్తోంది. సం బంధిత మండల ఏడీఏ ఇప్పటి వరకు జిల్లా స్థాయి అధికారికి నివేదిక ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతూనే ఉంది. ఏడీఏకు స్థానిక మండల టీఆర్‌ఎస్‌ నేతలతో మంచి సంబంధాలు ఉండడంతోనే ఆయన కొంత కాలంగా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌గా కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ నేతలను కాదని వ్యాపారులపై ఫిర్యాదు చేస్తే ఉన్న పదవి ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి కూడా ఆచి తూచిగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బేల మండలంలో బయోమందుల వ్యవహారం లో వ్యవసాయ శాఖాధికారులు, వ్యాపారులతో ఏదో డీల్‌ కుదిరినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-07-27T05:56:24+05:30 IST