బిరబిరా కృష్ణమ్మ పరుగులెత్తంగ

ABN , First Publish Date - 2022-08-12T06:07:06+05:30 IST

ఎగువ నుంచి వస్తున్న నీటితో నందికొండ నిండుకుండలా మారగా, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోని అన్నీ (26) క్రస్ట్‌గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ దిగవకు బిరబిరా పరుగులెట్టింది. సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం ఉదయం 5గంటలకు 588 అడుగులకు చేరుకోవటంతో, ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ హంసలదీవి వైపు వడివడిగా పరుగులిడుతోంది.

బిరబిరా కృష్ణమ్మ పరుగులెత్తంగ
సాగర్‌ 26 గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు

సాగర్‌ 26 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల

‘మూసీ’ మూడు గేట్ల ఎత్తివేత

‘పులిచింతల’లో 17గేట్ల నుంచి దిగువకు నీరు


నాగార్జునసాగర్‌: ఎగువ నుంచి వస్తున్న నీటితో నందికొండ నిండుకుండలా మారగా, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోని అన్నీ (26) క్రస్ట్‌గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ దిగవకు బిరబిరా పరుగులెట్టింది. సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం ఉదయం 5గంటలకు 588 అడుగులకు చేరుకోవటంతో, ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ హంసలదీవి వైపు వడివడిగా పరుగులిడుతోంది. 


సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,34, 230 క్యూసెక్కుల నీరు వస్తుండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగుల(312.0450టీఎంసీలు)కు,588 అడుగులకు (306.1010టీఎంసీలకు) చేరింది. దీంతో సాగర్‌ ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్‌ 13వ నెంబరు గేటు వద్ద పూజలు నిర్వహించి తెల్లవారుజామున 5 గంటలకు నీటిని విడుదల చేశారు. మొదట 10 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 1.26లక్షల క్యూసెక్కులు, ఆ తరువాత 10గంటలకు 12 గేట్ల ద్వారా, 12 గంటలకు 20 గేట్ల ద్వారా, మధ్యా హ్నం ఒంటి గంటకు 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా ఎగువనుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ కుడి కాల్వ ద్వారా 5,292 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 4,547 క్యూ సెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,206 క్యూ సెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని 26 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3,80,016 క్యూసెక్కులు మొత్తంగా 4,22,761 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నా రు. ఎగువనుంచి వరద ఉధృతి ఇలాగే కొనసాగితే శుక్రవా రం కూడా నీటి విడుదల ఉంటుందని ఇలాగే ఉంటుందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.  


‘మూసీ’ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4,979 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టాన్ని 638.35అడుగుల వద్ద నిలకడగా ఉంచుతున్న అధికారులు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు మించి 5,309 క్యూసెక్కుల వరద నీటిని మూడు క్రస్టుగేట్లను మూడు అడుగుల మేర ఎత్తి దిగువ వదులుతున్నారు. 645అడుగుల(4.46టీఎంసీలు) పూర్తిస్థా యి నీటిమట్టం కలిగిన ప్రాజెక్టు ప్రస్తుతం 638.35 అడుగులుగా (2.85 టీఎంసీలు) నమోదైంది.


పులిచింతల ప్రాజెక్టులో 17 గేట్లు ఎత్తివేత 

చింతలపాలెం: సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని మొత్తం 24గేట్లకు 17గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువనుంచి 3,44,748 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులోని 17గేట్లను 3.5 మీటర్లు ఎత్తి 4,36,525 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలోని మూడు యూనిట్ల ద్వారా 6000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు(45.77 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 166.46 అడుగులుగా(33.53 టీఎంసీలు) నమోదైంది.

Updated Date - 2022-08-12T06:07:06+05:30 IST