బీరేన్ సింగ్‌కే మళ్లీ మణిపూర్ సీఎం పగ్గాలు

ABN , First Publish Date - 2022-03-20T23:00:45+05:30 IST

మణిపూర్ తాత్కాలిక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌కే రెండోసారి ముఖ్యమంత్రి..

బీరేన్ సింగ్‌కే మళ్లీ మణిపూర్ సీఎం పగ్గాలు

ఇంఫాల్: మణిపూర్ తాత్కాలిక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌కే రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగిస్తున్నట్టు  బీజేపీ ప్రకటించింది. ఆదివారంనాడిక్కడ జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో రాష్ట్ర సీఎంగా బీరేన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెనువెంటనే బీరేన్ సింగ్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, బీజేపీ ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బీరేన్ సింగ్‌ను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున మణిపూర్‌లో సుస్థిర, బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు. కాగా ముఖ్యమంత్రిగా బీరేన్‌సింగ్ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి.


ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను 32 సీట్లలో బీజేపీ గెలుపు సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 7 సీటు, జనతాదళ్ యునైటెడ్ 6 సీట్లు గెలుచుకోగా, 4 సీట్లతో కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచింది.

Updated Date - 2022-03-20T23:00:45+05:30 IST