
లండన్ : ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషి సూనక్పై బ్రిటన్ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలపై గురువారం కఠినంగా ప్రశ్నించింది. ఈ కంపెనీలో రుషి సతీమణి అక్షత మూర్తికి వాటా ఉండటమే దీనికి కారణం. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై యూరోపు, అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రుషి సూనక్ను ఓ వార్తా సంస్థ విలేకరి కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘‘మీరు అందరు వ్యాపారవేత్తలకు ఇస్తున్న సలహాను మీ సొంతింట్లో అమలు చేయరా? రష్యాతో మీ కుటుంబానికి అనుబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ కన్సల్టెన్సీ ఫర్మ్ ఇన్ఫోసిస్‌లో మీ భార్యకు వాటా ఉన్నట్లు తెలుస్తోంది. వారు మాస్కోలో పని చేస్తున్నారు. వారికి అక్కడ ఓ కార్యాలయం ఉంది, వారికి అక్కడ ఓ డెలివరీ ఆఫీస్ ఉంది. వారికి మాస్కోలో ఆల్ఫా బ్యాంకుతో సంబంధం ఉంది. మీరు మీ సొంతింట్లో పాటించని సలహాను మీరు ఇతరులకు ఇస్తున్నారా?’’ అని విలేకరి అడిగినపుడు రుషి స్పందిస్తూ, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతల గురించి వివరించడానికి ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నానని, తన భార్యకు సంబంధించిన విషయాల గురించి కాదని చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రభుత్వం వల్ల మీ కుటుంబం లబ్ధి పొందుతోందా? అని అడిగినపుడు రుషి సమాధానం చెప్తూ, అది నిజమని తాను అనుకోవడం లేదన్నారు. రష్యాపై చెప్పుకోదగ్గ స్థాయిలో ఆంక్షలు విధించామని, అన్ని కంపెనీలు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నాయని చెప్పారు. దీనివల్ల పుతిన్ దురాక్రమణ బుద్ధికి బలమైన సందేశాన్ని పంపించినట్లు తెలిపారు.
ఇదిలావుండగా, ఇన్ఫోసిస్ విడుదల చేసిన ప్రకటనలో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ దేశాల మధ్య శాంతికి మద్దతును ప్రకటించింది. తమకు ఓ చిన్న ఉద్యోగుల బృందం రష్యాలో ఉందని, ఇక్కడి నుంచి గ్లోబల్ క్లయింట్స్‌కు సేవలు అందిస్తున్నామని తెలిపింది. స్థానిక రష్యన్ సంస్థలతో తమకు క్రియాశీలక వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో సమాజానికి సేవలను కొనసాగించడానికి పెద్ద పీట వేస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితుల సహాయార్థం 1 మిలియన్ డాలర్లను కేటాయించినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి