వాళ్లంతా బయటివాళ్లే... బెంగాల్‌లో వారికి చోటే లేదు: మమత

ABN , First Publish Date - 2020-11-27T03:26:49+05:30 IST

బీజేపీ నేతలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇవాళ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ..

వాళ్లంతా బయటివాళ్లే... బెంగాల్‌లో వారికి చోటే లేదు: మమత

కోల్‌కతా: బీజేపీ నేతలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇవాళ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ ‘‘బయటివాళ్ల పార్టీ’’ అనీ... దానికి బెంగాల్లో స్థానం లేదంటూ ఆమె దుయ్యబట్టారు. ‘‘కలహాలతో ముక్కలైన గుజరాత్’’ మాదిరిగా బెంగాల్‌ను మార్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మమత పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో పరిస్థితులు బాగోనప్పటికీ... కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో తలమునకలు కావడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ‘‘ఇలాంటి హోంమంత్రిని చూడలేదని’’ ఆమె ఎద్దేవా చేశారు. ఓ మీడియా సమావేశం సందర్భంగా మమత మాట్లాడుతూ... ‘‘బెంగాల్లో బయటి వారికి చోటు లేదు. బయటి నుంచి రాష్ట్రానికి వస్తున్న వాళ్లంతా కేవలం ఎన్నికల కోసం, శాంతిభద్రతలను చెడగొట్టడం కోసమే వస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించబోం...’’ అని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం ఇటీవల బెంగాల్‌ను ఐదు సంస్థాగత జోన్లుగా విభజించి, వాటికి ఇంచార్జులుగా కేంద్రమంత్రులను నియమించిన విషయం తెలిసిందే. ‘‘పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌గా మారుస్తామని వాళ్లు చెబుతున్నారు. అల్లర్లతో ముక్కలైన గుజరాత్‌లా బెంగాల్‌ను మారుస్తామని వాళ్లు ఎందుకు చెబుతున్నట్టు? మాకు కలహాలు అక్కర్లేదు..’’ అని మమత పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-27T03:26:49+05:30 IST