Gujarat riots : గుజరాత్ ప్రభుత్వంపై కుట్రకు సూత్రధారి సోనియా గాంధీ : బీజేపీ

ABN , First Publish Date - 2022-07-16T22:17:43+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (BJP) శనివారం

Gujarat riots : గుజరాత్ ప్రభుత్వంపై కుట్రకు సూత్రధారి సోనియా గాంధీ : బీజేపీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (BJP) శనివారం తీవ్రంగా విరుచుకుపడింది. 2002 గుజరాత్ అల్లర్ల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచి, కూల్చివేసేందుకు పన్నిన కుట్రకు ఆమె సూత్రధారి అని ఆరోపించింది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిలు పిటిషన్‌పై గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ నేపథ్యంలో బీజేపీ ఈ ఆరోపణలు చేసింది. 


గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ ప్రమేయం లేదని సుప్రీంకోర్టు గత నెలలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్ల కేసును రగిలించేందుకు పదే పదే పిటిషన్లు దాఖలు చేసినవారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌, అప్పటి గుజరాత్ పోలీసు ఉన్నతాధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌లను గుజరాత్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిలు కోసం  తీస్తా సెతల్వాద్ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు బెయిలు ఇవ్వవద్దని సిట్ శుక్రవారం ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నిన కుట్రలో సెతల్వాద్ భాగస్వామి అని ఆరోపించింది. అహ్మద్ పటేల్ ఆదేశాలను సెతల్వాద్, ఇతర నిందితులు అమలు చేసినట్లు ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలనుబట్టి తెలుస్తోందని పేర్కొంది. 


ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మీడియాతో మాట్లాడుతూ, సిట్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం అహ్మద్ పటేల్ కుట్రదారు అని, అయితే వాస్తవ చోదక శక్తి (driving force) ఆయన బాస్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అని ఆరోపించారు. కుట్ర జరిగిందని ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడైందన్నారు. అయితే ఈ కుట్రలకు చోదక శక్తి ఎవరు? అని ప్రశ్నించారు. ఆ శక్తి అహ్మద్ పటేల్ అని చెప్పారు. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు అని, సోనియా గాంధీకి ప్రధాన రాజకీయ సలహాదారు అని చెప్పారు. అహ్మద్ పటేల్‌ను వాడుకుని గుజరాత్ ప్రతిష్ఠను మసకబార్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని, అస్థిరపరచాలని ఆమె ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలోని అత్యున్నత స్థాయి నేత నుంచి సెతల్వాద్‌కు రూ.30 లక్షలు అందినట్లు అఫిడవిట్ పేర్కొందని తెలిపారు. బీజేపీ, మోదీల ప్రతిష్ఠను మసకబార్చేందుకు, రాహుల్ గాంధీకి మంచి పేరు వచ్చేలా చేసేందుకు సోనియా గాంధీ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ఎవరికీ తెలియదన్నారు. మీడియా సమావేశం నిర్వహించి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎందుకు కుట్ర పన్నారో దేశానికి తెలియజేయాలని సోనియా గాంధీని హృదయపూర్వకంగా కోరుతున్నామని చెప్పారు. 


దివంగత నేతలను సైతం వదలరా?

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శనివారం స్పందిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. అహ్మద్ పటేల్‌పై గుజరాత్ సిట్ చేసిన ఆరోపణలను ఖండించింది. నరేంద్ర మోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో జరిగిన మతపరమైన హింసకు బాధ్యతవహించకుండా తప్పించుకోవడం కోసం పద్ధతి ప్రకారం అమలు చేస్తున్న వ్యూహంలో భాగమే ఇదంతానని ఆరోపించింది. మోదీ రాజకీయ కక్షసాధింపు యంత్రం తన రాజకీయ ప్రత్యర్థులు దివంగతులైనప్పటికీ వదిలిపెట్టదని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఈ సిట్ తన రాజకీయ యజమాని బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తోందని, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుందని ఆరోపించింది. 


న్యాయ ప్రక్రియ జరుగుతుండగా, మీడియా ద్వారా, తీవ్రమైన ఆరోపణలను నిర్థరణలుగా భావించాలని బాకా ఊదే కీలుబొమ్మ దర్యాప్తు సంస్థల ద్వారా తీర్పులివ్వడం నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్న చిట్కాలేనని ఆరోపించింది. ఇది మరొక ఉదాహరణ మాత్రమేనని తెలిపింది. ఓ దివంగత నేత ఇటువంటి అబద్ధాలను తిరస్కరించడానికి అందుబాటులో ఉండరని, అందువల్ల ఆ నేతను చులకనగా మాట్లాడటం ఈ సందర్భంలో అదనపు లక్షణమని ఆరోపించింది. 


Updated Date - 2022-07-16T22:17:43+05:30 IST