బీజేపీ నూతన సారథుల నియామకం

ABN , First Publish Date - 2020-09-23T06:31:13+05:30 IST

భార తీయ జనతా పార్టీ మేడ్చల్‌ జిల్లా రూరల్‌, అర్బన్‌ ప్రాంతాలకు నూతన సారథులను అధిష్ఠానం నియమించింది.

బీజేపీ నూతన సారథుల నియామకం

మేడ్చల్‌జిల్లా రూరల్‌ అధ్యక్షుడిగా పట్లోళ్ల విక్రంరెడ్డి, 

అర్బన్‌ అధ్యక్షుడిగా పన్నాల హరీష్‌రెడ్డి 


(ఆంధ్రజ్యోతి , మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ మేడ్చల్‌ జిల్లా రూరల్‌, అర్బన్‌ ప్రాంతాలకు నూతన సారథులను అధిష్ఠానం నియమించింది. మంగళవారం రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన 12మంది నూతన పార్టీ అధ్యక్షులను బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ప్రకటించారు. మేడ్చల్‌జిల్లా రూరల్‌ ప్రాంత అధ్యక్షుడిగా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీకి చెందిన పట్లోళ్ల విక్రంరెడ్డిని, అర్బన్‌ప్రాంత అధ్యక్షుడిగా కూకట్‌పల్లికి చెందిన పన్నాల హరీ్‌షరెడ్డిని నియమించింది. పట్లోళ్ల విక్రంరెడ్డి విద్యార్థి దశ నుంచి బీజేపీలో చురుకుగా పనిచేస్తున్నారు. ఏబీవీపీ రాష్ట్రస్థాయిలో పనిచేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గుండ్లపోచంపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌ బాధ్యతలను నిర్వహించారు. పన్నాల హరీ్‌షరెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలో కీలకమైన నేత. ఆయన భార్య కార్పొరేటర్‌. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది.


రానున్న గ్రేటర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నగరశివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో పార్టీని ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గతంలో కొత్తజిల్లాల వారీగా నూతన కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే మేడ్చల్‌, రంగారెడ్డిజిల్లాతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల్లో పార్టీని విస్తరించింది. నగరంతో పాటు శివారు జిల్లాల పరిధిలో అర్బన్‌, రూరల్‌ప్రాంతాలుగా విభజించి నూతన సారథులను ఎంపిక చేసింది. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కమిటీ పరిధిలో ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంతమైన మేడ్చల్‌ నియోజవర్గం ఉండేవి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల వరకు మేడ్చల్‌మల్కాజ్‌గిరి అర్బన్‌జిల్లా కమిటీని, నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు, 61 గ్రామపంచాయతీలతో మేడ్చల్‌మల్కాజ్‌గిరి రూరల్‌ జిల్లా కమిటీని ఏర్పాటు చేసింది.


బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా సదానందరెడ్డి

వికారాబాద్‌: బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా సదానందరెడ్డిని నియమిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదానందరెడ్డి ఇంతకుముందు బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సతీమణి వికారాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు పదవి ముగియడంతో ఆయన స్థానంలో అధిష్ఠానం సదానందరెడ్డిని నియమించింది.

Updated Date - 2020-09-23T06:31:13+05:30 IST