యశ్వంత్ సిన్హాకు మద్దతు మానుకుంటారా?... మమతకు బీజేపీ ప్రశ్న...

ABN , First Publish Date - 2022-07-02T22:55:02+05:30 IST

జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) బలపరుస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి

యశ్వంత్ సిన్హాకు మద్దతు మానుకుంటారా?... మమతకు బీజేపీ ప్రశ్న...

న్యూఢిల్లీ : జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) బలపరుస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించడంతో బీజేపీ ఓ ప్రశ్నను సంధించింది. ప్రతిపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)కు మద్దతును మానుకుంటారా? అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) ప్రశ్నించారు.


మమత బెనర్జీ శుక్రవారం మాట్లాడుతూ, మహారాష్ట్రలో ప్రభుత్వం మారినందువల్ల ఎన్డీయే ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు చెప్పేదానినిబట్టి నడుచుకుంటామని చెప్పారు. ముర్ము పేరును ప్రకటించడానికి ముందు బీజేపీ తమతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. తమ సలహాలను బీజేపీ స్వీకరించి ఉంటే, తాము పరిశీలించి ఉండేవారమని చెప్పారు. 


ఈ నేపథ్యంలో అమిత్ మాలవీయ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, దేవూచా పచమిలో గిరిజనుల భూమిని స్వాధీనం చేసుకోవడానికి మమత చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఫొటోకు పోజు ఇవ్వడం కోసం జన జాతీయ మహిళల చేతులకు గ్లోవ్స్ తొడిగించాలని పట్టుబట్టిన తర్వాత, తన గిరిజన వ్యతిరేక, మహిళా వ్యతిరేక వైఖరి సమర్థనీయం కాదని ఆమెకు తెలిసిందా? అని ప్రశ్నించారు. ఆమె యశ్వంత్ సిన్హాకు మద్దతును మానుకుంటారా? అని ప్రశ్నించారు. 


ఇదిలావుండగా, ద్రౌపది ముర్ముకు మద్దతిస్తామని శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. 


Updated Date - 2022-07-02T22:55:02+05:30 IST