BS Yediyurapp కుమారుడికి Bjp టిక్కెట్ నిరాకరణ

ABN , First Publish Date - 2022-05-24T23:08:44+05:30 IST

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప Yediuurapp) తనయుడు బీవై విజయేంద్రకు నిరాశ...

BS Yediyurapp కుమారుడికి Bjp టిక్కెట్ నిరాకరణ

బెంగళూరు: కర్ణాటక ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) తనయుడు బీవై విజయేంద్ర (BY Vijayandra)కు నిరాశ ఎదురైంది. బీజేపీ కోర్ కమిటీ సిఫారుసు చేసిన పేర్లలో విజయేంద్ర పేరు ఉన్నప్పటికీ పార్టీ కేంద్ర అధిష్ఠానం ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరారించింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని 7 సీట్లకు జూన్ 3న ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు నలుగురు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ సవడి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు హేమలత నాయక్, ఎస్.కేశవప్రసాద్, ఎస్‌స మోర్చా అధ్యక్షుడు చలవడి నారాయణస్వామి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది.


కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా విజయేంద్రను నిలబెట్టేందుకు పార్టీ ఆసక్తితో ఉందని, ఎన్నికల ముందు ఆయనకు పార్టీలో మరింత పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడికి ఎమ్మెల్సీ టిక్కెట్‌‌ను యడియూరప్ప ఆశించారని, తద్వారా బసవరాజ్ బొమ్మై క్యాబినెట్‌లోకి మంత్రిగా విజయేంద్రను చేయాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. గత ఏడాది జూలైలో సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసే సమయంలోనూ ఆయన మద్దతుదారులు ఇదే తరహా డిమాండ్లు చేశారు.


యడియూరప్ప ప్రస్తుతం షికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండగా, శివమొగ్గ ఎంపీగా ఆయన పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయేంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తే ఆనువంశిక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ వాదన బలహీనపడే అవకాశం ఉంటుందని పార్టీ కేంద్ర అధిష్ఠానం అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. మంగళవారంతో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుండగా, దీనికి కొద్ది గంటలకు ముందే బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం విశేషం.

Updated Date - 2022-05-24T23:08:44+05:30 IST