ఆత్మకూరు ఏపీలో ఉందా? లేదా?.. జగన్‌కు సోము వీర్రాజు లేఖ

ABN , First Publish Date - 2022-01-10T01:34:15+05:30 IST

ఆత్మకూరు ఏపీలో ఉందా? లేదా? అని సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆత్మకూరు ఘటనపై ..

ఆత్మకూరు ఏపీలో ఉందా? లేదా?.. జగన్‌కు సోము వీర్రాజు లేఖ

అమరావతి: ఆత్మకూరు ఏపీలో ఉందా? లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆత్మకూరు ఘటనపై సీఎం జగన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆత్మకూరు పాకిస్థాన్‌లో ఒక భాగమని ముఖ్యమంత్రి భావిస్తున్నారా? అని నిలదీశారు. ఆత్మకూరులో ఘటన జరిగి 24 గంటలు గడిచినా ముఖ్యమంత్రి ఎందుకు స్వయంగా ప్రకటన చేయలేదన్నారు. ఒక వర్గం వారిపై ఉద్దేశపూర్వకంగా  దాడి చేస్తే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతమని సోము వీర్రాజు ప్రశ్నించారు. 


‘‘ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు హిందువులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించడం వెనుక అర్థం ఏమిటి?. ఆమాత్రం తెలియనంతగా ఆత్మకూరు ప్రజానీకం లేరన్న సంగతి ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. అనుమతి లేకుండా మసీదు ఎలా నిర్మాణం చేస్తారు. ఇదే విషయాన్ని పోలీసుల సమక్షంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై దాడి చేసి ప్రాణహాని తలపెట్టటానికి ప్రయత్నం చేశారు. జరిగిన సంఘటనపై డీజీపీ ఆలస్యంగా స్పందించడమే కాదు, ఈ సంఘటనలో గాయపడిన పోలీసులకు కనీస ధైర్యం చెప్పలేదంటే ముఖ్యమంత్రి మౌనం ప్రజలు అర్థం చేసుకుంటారని గ్రహించాలని కోరుతున్నాను. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఇప్పటివరకు సహనంగా ఎదురుచూశాం. మసీదు నిర్మాణం అంటే పదిమంది లేదా ఇరవై మంది ఉండాలి. వందల సంఖ్యలో అక్కడ ఏ ఉద్దేశంతో ఉన్నారు. యధేచ్చగా రాళ్ళ దాడి జరుగుతుంటే ఆర్డ్మ్ ఫోర్స్‌ను అదనంగా ఎందుకు పంపలేదు. ఇంతవరకు దాడికి పాల్పడిన వారిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. ముఖ్యమంత్రికి ఈలేఖ ద్వారా ఒక విషయం స్పష్టం చేయదలిచాను. ఆత్మకూరు సంఘటనపై బీజేపీ సీరియస్‌గా తీసుకుంటుదన్న విషయం చెప్పదలిచాను. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళతాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసులు బేషరతుగా ఉపసంహరించాలి.’’ అని సోము వీర్రాజు లేఖలో సూచించారు.

Updated Date - 2022-01-10T01:34:15+05:30 IST