సిద్ధూ సలహాదారులపై చర్యకు బీజేపీ డిమాండ్

ABN , First Publish Date - 2021-08-25T00:52:35+05:30 IST

కశ్మీరు, పాకిస్థాన్‌లపై పంజాబ్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై

సిద్ధూ సలహాదారులపై చర్యకు బీజేపీ డిమాండ్

న్యూఢిల్లీ : కశ్మీరు, పాకిస్థాన్‌లపై పంజాబ్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించాలని ఆ పార్టీ అధిష్ఠానాన్ని బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థిస్తున్నట్లేనని స్పష్టం చేశారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ కొత్తగా నియమించుకున్న సలహాదారులు మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గ్ వ్యాఖ్యలపై నడ్డా ఈ డిమాండ్ చేశారు. 


జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని, అధికరణ 35ఏను రద్దు చేయడంపై మల్వీందర్ సింగ్ మాలి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాకిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను గార్గ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను మొదట ఖండించిన కాంగ్రెస్ నేతల్లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నారు. ఈ సలహాదారులను కట్టడి చేయాలని సిద్ధూను ముఖ్యమంత్రి కోరారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కూడా ఈ సలహాదారుల వ్యాఖ్యలను ఖండించారు. తనను కలవాలని వీరిద్దరినీ సిద్ధూ ఆదేశించారు. 


జేపీ నడ్డా మంగళవారం ఇచ్చిన ట్వీట్లలో, పంజాబ్ కాంగ్రెస్ నేతలు కశ్మీరు, పాకిస్థాన్‌లపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారేమో కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థిస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన నేతలకు పంజాబ్ కాంగ్రెస్ పెద్దలతోపాటు, ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్ఠానం మద్దతు ఉందననారు. వీరి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని తెలిపారు. వారు దేశ భద్రతపై తీవ్ర ప్రభావం కలిగించే బాధ్యతారహితమైన ప్రకటనలు  పదే పదే చేస్తున్నారన్నారు. 


Updated Date - 2021-08-25T00:52:35+05:30 IST