ఆర్థిక వ్యవస్థను Destroy చేసిన Bjp: Rahul

ABN , First Publish Date - 2022-05-16T23:30:24+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...

ఆర్థిక వ్యవస్థను Destroy చేసిన Bjp: Rahul

బాన్స్‌వారా: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  (Rahul gandhi) విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను (Economy) బలోపేతం చేస్తే బీజేపీ దానిని పూర్తిగా బలహీనపరిచిందని అన్నారు. దక్షిణ రాజస్థాన్‌లో గిరిజన ప్రాబల్యం ఉన్న బాన్స్‌వారా జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, ప్రజల్లో చీలfకలు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రజలతో మమేకమయ్యేందుకు కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. రెండు హిందుస్థాన్‌లను (Two Hindustans) సృష్టించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని విమర్శించారు. ఇందులో ఒకటి ధనికుల కోసమని, ఎంపిక చేసిన ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమని, మరొకటి దళితులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల కోసమని అన్నారు. కాంగ్రెస్ మాత్రం ఒకే హిందుస్థాన్‌ను కోరుకుంటోందని తెలిపారు. ''దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది'' అని రాహుల్ అన్నారు.


''అందరినీ కలుపుకొంటూ వెళ్లడం, గౌరవించడం, ప్రతి ఒక్కరి సంస్కృతీ పరిరక్షణ దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. బీజేపీ మాత్రం చీలికలు, ఒత్తిడి, అణిచివేతల దిశగా వెళ్తోంది. గిరిజనుల చరిత్ర, సంస్కృతిని నామరూపాల్లేకుండా చేసేందుకు బీజేపీ పనిచేస్తోంది''అని రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగ సమస్యపైనా బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వం దాడి చేసిందని, ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని, జీఎస్‌టీ అమలులో తప్పిదాల కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం పనిచేస్తే, నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవస్థకు కీడు చేశారని ఆరోపించారు. హిందుస్థాన్‌లో ఇవాళ తమకు ఉద్యోగాలు రావనే విషయం యువత ప్రతి ఒక్కరికీ తెలుసునని, ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోందని అన్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపికి చేసిన పారిశ్రామికవేత్తలకు మాత్రమే పూర్తి లబ్ధి చేకూర్చేందుకు తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడంతో కేంద్రం ఉపసంహరించుకోక తప్పలేదని అన్నారు.


గిరిజనులతో కాంగ్రెస్‌కు సుదీర్ఘమైన సంబంధాలున్నాయని రాహుల్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల చరిత్రను పరిరక్షించిందని, యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల కోసం అటవీ భూములు, జల పరిరక్షణకు చారిత్రక చట్టాలు తీసుకువచ్చిందని అన్నారు. రైతులు, గిరిజనులు, దళితులతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసం అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా ఆయన మెచ్చుకున్నారు.

Updated Date - 2022-05-16T23:30:24+05:30 IST