‘కమలం’లో కదనోత్సాహం

ABN , First Publish Date - 2022-07-03T05:38:27+05:30 IST

‘తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు జనాన్ని భారీ సంఖ్యలో తరలించడంపై దృష్టి సారించారు.

‘కమలం’లో కదనోత్సాహం

నేటి మోదీ సభకు భారీ జన సమీకరణ
దిశానిర్దేశం చేసిన బీజేపీ అగ్రనేతలు
డివిజన్‌ అధ్యక్షులు, శక్తికేంద్రాలతో సమావేశాలు
హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిన నేతలు
జిల్లాలో ముగిసిన సంపర్క్‌ అభియాన్‌


హనుమకొండ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు జనాన్ని భారీ సంఖ్యలో తరలించడంపై దృష్టి సారించారు. శుక్రవారం అంతా తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటించిన వీరు.. రాత్రి పొద్దు పోయేవరకు, శనివారం ఉదయం కూడా డివిజన్‌ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం నుంచి జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో భారీ జన సమీకరణకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు. ఏ డివిజన్‌ నుంచి ఎంతమంది వెళ్లేది లెక్కలు తీశారు. జాబితాలు తయారు చేశారు. వారికి రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక బీజేపీ నేతల ఇళ్లలో అల్పాహారం తీసుకున్న అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి, రాజస్థాన్‌ ఎంపీ ఓం ప్రకాశ్‌ మాధూర్‌, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి  అనిల్‌ రాజ్‌ బరార్‌ ఉదయం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం హనుమకొండలోని రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాలగుడిని సందర్శించారు.  ప్రత్యేక పూజలు నిర్వర్తింప చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి నివాసగృహానికి వెళ్లారు. ఆయన ఇంట్లో కార్యకర్తలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు,  పార్టీ పరిస్థితిపై చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. శుక్రవారం రాత్రి  హనుమకొండ కనకదుర్గ కాలనీలో 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుజ్జుల వసంత మహేందర్‌ రెడ్డి ఇంట్లో కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. పరకాల నియోజకవర్గం ఇన్‌చార్జి త్రిపుర ఎంపీ అరుణ్‌ సాహో కూడా ఉదయం డివిజన్‌ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలతో సమావేశమై మోదీ జనసమీకరణ జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

దూకుడు పెంచిన బీజేపీ
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీజేపీ దూకుడును మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందివచ్చిన అవకాశాలన్నిటినీ వాడుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా పార్టీ సమాయత్తానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు పార్టీకి కలిసి వచ్చింది. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పార్టీ దిగ్గజాలందరూ వస్తున్నారు. సమావేశాలను విజయవంతం చేసే కృషిలో భాగంగా సంస్థాగత చర్యలను పార్టీ చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ పునాదులు గ్రామస్థాయి నుంచి బలపడేందుకు  ఈ చర్యలు దోహద పడగలవని నేతలు భావిస్తున్నారు. చాలాకాలం తర్వాత ఉమ్మడి జిల్లాలో పార్టీ నేతలు ఐక్యంగా  కదులుతున్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఈ పరిణామాం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.  

సంస్థాగతంగా...
ఉమ్మడి జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలు,  రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఆయా నియోజవర్గాల పరిధిలోని మండల, గ్రామస్థాయిల్లో, అలాగే  అర్బన్‌ నియోజకవర్గాల్లో డివిజన్‌ స్థాయిలో కమిటీలను వేశారు. ఇదేక్రమంలో జిల్లా స్థాయిలో వివిధ మోర్చాలకు కమిటీల ఏర్పాటు కూడా పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో పార్టీకి సంస్థాగతంగా బలమైన పునాదులు పడుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఈ పునాదులపైనే పార్టీ బలోపతానికి మరింత కృషి జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటి నుంచే..
అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ఎంపికచేసి ఇప్పటి నుంచే ఆయా నియోజవర్గాల్లో వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ విజయావకాశాలను పెంచుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఇదే సమయంలో అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా ప్రజల్లోకి  మరింత బలంగా చొచ్చుకువెళ్లాలని యోచిస్తోంది. గతంలో కన్నా భిన్నంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని పార్టీ అఽధినాయకత్వం స్పష్టం చేసింది. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికే టికెట్‌ ఇవ్వనున్నట్టు స్పష్టం చేయడంతో నేతలు నిజాయితీగానే శ్రమించేందుకు నడుంబిగిస్తున్నారు. 



Updated Date - 2022-07-03T05:38:27+05:30 IST