అంబులెన్స్‌లను ఆపడం హేయం

ABN , First Publish Date - 2021-05-11T04:50:56+05:30 IST

అంబులెన్స్‌లను ఆపడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.

అంబులెన్స్‌లను ఆపడం హేయం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

    అయిజ, మే 10 : అంబులెన్స్‌లను ఆపడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అయిజలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు బాధితులు వెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు వద్ద పోలీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి తీరని మచ్చగా మిగిలిపోతుందని గుర్తుచేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ వాసులు కర్నూల్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ కంటే కూడా కర్నూల్‌పైనే ఆధారపడ్డారని తెలిపారు. ఆంద్రప్రదేశ్‌కు చెందిన వారు అంబులెన్స్‌ను ఆపితే మన జిల్లావాసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇతర దేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్న ఈ సమయంలో పక్కరాష్ట్రం నుంచి వచ్చే రోగులను అడ్డుకోవడం మనిషి లక్షణం కాదన్నారు. ప్రతి మనిషి ప్రాణం విలువైనదేనని గుర్తెరిగి సీఎం కేసీఆర్‌ ప్రవర్తించాలని తెలిపారు. వైద్యసేవలకు వెళ్ళే ఏ వాహనాన్నీ ఆపొద్దని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే ఆందోళనకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జలగరి అశోక్‌, మెడికల్‌ తిర్మల్‌రెడ్డి, వెంకటేష్‌యాదవ్‌, అంజి, భీమ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:50:56+05:30 IST