అవినాశ్‌రెడ్డి మాకు అక్కర్లేదు: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-03-10T01:59:19+05:30 IST

అధికారం కోల్పొయిన నేతలు అధికార పార్టీల్లో చేరడం ప్రస్తుతం సర్వసాధరణమైంది. అప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న నేతలు పాలల్లో

అవినాశ్‌రెడ్డి మాకు అక్కర్లేదు: సోమువీర్రాజు

అమరావతి: అధికారం కోల్పొయిన నేతలు అధికార పార్టీల్లో చేరడం  ప్రస్తుతం సర్వసాధరణమైంది. అప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న నేతలు పాలల్లో నీళ్లలా కలసిపోవడం మామూలైంది. అధికార పార్టీలో చేరడానికి రకరకాల కారణాలు కూడా వినిపిస్తుంటాయి.  కేసుల భయంతో కొందరు పార్టీ మారితే.. మరికొందరు అధికారం యావతో ఇతర పార్టీల్లోకి చేరుతుంటారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం పార్టీలు కూడా వలసలను ప్రోత్సహిస్తూ ఉంటాయి. దీనికి ముద్దుగా ‘ఆకర్ష్’ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి పార్టీలు.  ఇవన్నీ ఇప్పుడు కామన్.


 ‘‘మా నాన్నను ఎవరు చంపారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్‌)ను కోరా.. అనుమానితుల పేర్లూ చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్‌.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు.. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్‌ చేశా.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది..? అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై12 కేసులు అవుతాయ్‌ అని జగన్‌ మాట్లాడడం నన్ను బాధించింది.’’  అని మాజీమంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రస్తావించారు. 


ప్రస్తుతం మాజీమంత్రి వివేకనందరెడ్డి హత్యకేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. వైఎస్ కుటుంబసభ్యులు సీబీఐ ఇస్తున్న వాగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘‘అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై12 కేసులు అవుతాయ్‌ అని జగన్‌ మాట్లాడడం నన్ను బాధించింది’’ అని సునీత తెలిపారు. అప్పటి నుంచి అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. 


అవినాశ్‌రెడ్డి, బీజేపీలో చేరుతారనే ప్రచారంపై బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు.  గనులు అమ్మేవారితో బీజేపీకి పనిలేదని, అవినాశ్‌రెడ్డి తమ పార్టీకి అక్కర్లేదని  సోము వీర్రాజు తేల్చిచెప్పారు. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతానని అని ఉంటే, ఎవరితో అన్నారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.  అవినాశ్‌రెడ్డి లాంటి వాళ్లని బీజేపీలోకి ఆహ్వానించాల్సిన అవసరంరాదని సోమువీర్రాజు తేల్చిచెప్పారు.



Updated Date - 2022-03-10T01:59:19+05:30 IST