కమలం.. ఇక కదనమే

ABN , First Publish Date - 2022-01-11T09:35:01+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను నిరసిస్తూ దీక్షను ప్రారంభించి..

కమలం.. ఇక కదనమే

  • తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం దృష్టి
  • అధికారంలోకి వచ్చే అవకాశముందని అంచనా
  • సంజయ్‌ అరెస్టు అసహనానికి ప్రతీకని భావన
  • సీరియస్‌గా రంగంలోకి దిగిన నాయకులు
  • రాష్ట్రానికి వరుసకట్టిన సీఎంలు, మాజీ సీఎంలు
  • జీవో 317పై సంక్రాంతి తర్వాత భారీ సభ?


హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను నిరసిస్తూ దీక్షను ప్రారంభించి.. అరెస్టైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలైనప్పుడు ఏకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు! కిషన్‌ రెడ్డి, భగవంత్‌ ఖుబా జైలు వద్దకు వెళ్లి మరీ ఆయనను పరామర్శించారు! ఆ తర్వాత రోజు ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ వచ్చి కరీంనగర్‌లో సంజయ్‌ను కలిశారు! ఆ వెంటనే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాష్ట్రానికి వచ్చారు! పార్టీ ఆఫీసులోనే సంజయ్‌ను కొనియాడి.. సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు! ఆ తర్వాత రోజు అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ విశ్వ శర్మ వచ్చారు! ఆ సమయంలో హనుమకొండలో భారీ సభ ఏర్పాటు చేశారు! మంగళవారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రానున్నారు! మధ్యలో, హైదరాబాద్‌లో జరిగిన ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్‌ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు! ఇక, ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలు సంజయ్‌కు ఫోన్‌ చేసి మరీ ఆరా తీశారు! ఏమిటిదంతా!? రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోపై ప్రతిపక్ష నేత చేస్తున్న దీక్షను భగ్నం చేస్తే.. బీజేపీ జాతీయ నాయకులంతా హుటాహుటిన రాష్ట్రానికి రావడం ఏమిటి!? సంజయ్‌కు పెద్దఎత్తున మద్దతు ప్రకటించడం ఏమిటి!? ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు కూడా కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ జైలుకు పంపుతామని అల్టిమేటం జారీ చేయడం ఏమి టి!? కరీంనగర్లో ఎంపీ కార్యాలయాన్ని బద్దలు కొట్టి.. జల ఫిరంగులను ప్రయోగించి మరీ సంజయ్‌ను అరెస్టు చేసినందుకే బీజేపీ ఈ స్థాయిలో స్పందిస్తోందా!? అంటే, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసే అవకా శం ఉందని బీజేపీ అధిష్ఠానం అంచనాకు వచ్చిందని, ప్రస్తుత స్పందనకు ఇదే కారణమని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి! నిజానికి, గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన ఆ పార్టీ పరిస్థితి అయిపోయిందనే అంతా భావించారు. 


కానీ, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుపొందడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అనంతరం, బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ స్థానాన్ని చేజిక్కించుకోవడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇవ్వడంతో రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందనే అభిప్రాయం వ్యక్తమైం ది. ఇక, ప్రభుత్వం, అధికార పార్టీ సర్వ శక్తులనూ మోహరించినా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలుపుతో కాషాయ పార్టీలో హుషారు తారస్థాయికి చేరింది. పూర్తిస్థాయిలో పోరాడితే 2023లో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు. తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకుల మోహరింపు వెనక కారణం ఇదేనని ఆ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. నిజానికి, వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీని ఇరుకున పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఎత్తులు వేశారని, కానీ, ఈ విషయంలో అధికార పార్టీ తీరునే రైతులు తప్పుబడుతున్నారని, అందుకే, రైతు బంధు సంబరాల పేరిట కొత్త నాటకానికి తెర తీశారని బీజేపీ అగ్ర నాయకుడు ఒకరు విశ్లేషించారు. ‘‘టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై సంజయ్‌ మొదటి నుంచీ కొనసాగిస్తున్న దూకుడు వైఖరి పార్టీకి ప్రజల్లో ఆదరణను పెంచింది. దీనిని ఇలాగే కొనసాగించాలని జాతీయ నాయకత్వం నిర్దేశించింది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేసీఆర్‌ మోసం చేస్తున్నారన్న విషయాన్ని రైతులకు వివరించి.. వారికి వాస్తవాలను చెప్పడంలో విజయవంతమయ్యాం. నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపట్టి వారి దృష్టిని ఆకర్షించాం. తాజాగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా జీవో 317ను సవరించాలంటూ పోరాటం చేస్తున్నాం. కరీంనగర్‌ ఘటనతో కేంద్ర నాయకత్వం మా పోరాటాన్ని గుర్తించి, పూర్తి అండగా నిలిచింది’’ అని పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు.


కేసీఆర్‌ సర్కారుపై యుద్ధమే!

జీవో 317ను ఉపసంహరించాలంటూ జాగరణ దీక్షకు దిగిన సంజయ్‌ని అరెస్టు చేసిన తీరును పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోందని, ప్రభుత్వ తాజా చర్యలన్నీ అసహనానికి ప్రతీకలని అగ్ర నేతలు భావిస్తున్నారని బీజేపీ నేత ఒకరు వివరించారు. దాంతో, తక్షణమే రంగంలోకి దిగిన జాతీయ నాయకులు.. తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ‘‘మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేసిన తీరు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని కళ్లారా చూసిన జాతీ య నాయకత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలిసినా, ఇప్పటి వరకు చూసీ చూడనట్లు వ్యవహరించిన అధిష్ఠానం, సంజయ్‌ ఘటనతో అనూహ్యంగా స్పందించింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రానికి కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, పార్టీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కదలి వెళ్లాలని, స్థానిక నాయకులకు అండగా నిలవాలని ఆదేశించింది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. జీవో 317 సవరణ కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సంక్రాంతి తర్వా త హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆహ్వానించాలని భావిస్తున్నామని బీజేపీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని మేం ప్రజల్లో విశ్వాసం కలిగించగలిగాం.  మా నాయకులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వేధింపులను జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. బెంగాల్‌ తరహాలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది’’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

Updated Date - 2022-01-11T09:35:01+05:30 IST