Delhi AAP govt : నా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ రూ.800 కోట్లు సిద్ధం చేసుకుంది : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-08-25T20:21:34+05:30 IST

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ

Delhi AAP govt : నా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ రూ.800 కోట్లు సిద్ధం చేసుకుంది : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ (BJP) రూ.800 కోట్లు సిద్ధం చేసుకుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారన్నారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ ఆరోపణ చేశారు. 


కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించిన మర్నాడు మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. కేజ్రీవాల్‌కు ద్రోహం చేస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టిందన్నారు. అదృష్టవశాత్తూ మనీశ్ సిసోడియాకు ముఖ్యమంత్రి పదవిపై దురాశలేదన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు చావనైనా చస్తారు కానీ అమ్ముడుపోరన్నారు. ‘‘నా ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అందుకోసం రూ.800 కోట్లు సిద్ధం చేసుకుంది’’ అన్నారు. 


బీజేపీ ఆపరేషన్ లోటస్ విఫలమవాలని కోరుతూ ఆప్ ఎమ్మెల్యేలు మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించారు. పార్టీ మారితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున ఇస్తామని బీజేపీ ఆశపెడుతోందని ఆప్ ఆరోపించింది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తాము తుది శ్వాస వరకు పార్టీతోనే ఉంటామని అందరు ఎమ్మెల్యేలు చెప్పారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని తెలిపారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాలకు వెళ్ళారని, మంత్రి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారని, మరొకరు ఫోన్ ద్వారా పాల్గొన్నారని చెప్పారు.  ఈ సమావేశంలో మాట్లాడిన 12 మంది ఎమ్మెల్యేలు తమను బీజేపీకి చెందినవారు సంప్రదించారని చెప్పారు. 


ఇదిలావుండగా, ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పబ్లిక్ స్టంట్ అని కొట్టిపారేసింది.


Updated Date - 2022-08-25T20:21:34+05:30 IST