Bjp : ఆపరేషన్ ‘కర్నాటక’

ABN , First Publish Date - 2021-07-27T02:19:08+05:30 IST

బీజేపీ అధిష్ఠానం ‘ఆపరేషన్ కర్నాటక’ ను ప్రారంభించింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప

Bjp : ఆపరేషన్ ‘కర్నాటక’

బెంగళూరు : బీజేపీ అధిష్ఠానం ‘ఆపరేషన్ కర్నాటక’ ను ప్రారంభించింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎవర్ని నియమిస్తారన్నది ఇదమిత్థంగా తెలియడం లేదు. మరోవైపు ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ అరుణ్ సింగ్ మంగళవారం బెంగళూరు వెళ్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై నియమించబోయే ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తిరిగి అధికారాన్ని దక్కించుకోడానికి కూడా మార్గాన్ని వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా పలువురు సీనియర్ మంత్రులను కూడా బీజేపీ అధిష్ఠానం తప్పించనున్నట్లు తెలుస్తోంది.


ప్రజాదరణ తక్కువగా ఉన్నవారు, తరచూ వివాదల్లో ఇరుక్కునే వారికి ఈ సారి ఉద్వాసన పలకనున్నారు. కర్నాటకలో పార్టీని సమూల ప్రక్షాళన చేసే భాగంలోనే ఇదంతా జరుగుతున్నట్లు సమాచారం. గోవింద కారాజోల్, అశ్వత్థ నారాయణ, లక్ష్మణ సంగప్ప.... ఈ ముగ్గురు ప్రస్తుతం డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతున్నారు. వీరిలో ఇద్దరికి ఉద్వాసన పలకనున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్న నేతకు డిప్యూటీ సీఎం పగ్గాలివ్వనున్నారు. అయితే అప్పటి అవసరాల దష్ట్యా, యడియూరప్పకు మద్దతివ్వడానికి ఇతర పార్టీల్లోంచి బీజేపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి సంకటంలో పడింది. అలాంటి వారు 12 మంది ఉన్నారు. వచ్చేసారి తమకు టిక్కెట్లు దొరకవని వారందరూ ఆందోళన చెందుతున్నారు. వారికి బీజేపీ పెద్దలు ఎలాంటి హామీ ఇస్తారన్నది తేలాల్సి ఉంది.

Updated Date - 2021-07-27T02:19:08+05:30 IST