కర్ణాటక మంత్రివర్గం నుంచి ఈశ్వరప్ప తొలగింపు?

ABN , First Publish Date - 2022-04-13T19:05:12+05:30 IST

అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఈశ్వరప్పను కర్ణాటక మంత్రివర్గం నుంచి

కర్ణాటక మంత్రివర్గం నుంచి ఈశ్వరప్ప తొలగింపు?

బెంగళూరు : అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఈశ్వరప్పను కర్ణాటక మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ అధిష్ఠానం బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకోబోతోంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈశ్వరప్ప మరింత తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 


ప్రాథమికంగా చూసినపుడు సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోందని కర్ణాటక పోలీసులు తెలిపారు. ఆయన మరణానికి ముందు తన స్నేహితులకు ఓ వాట్సాప్ సందేశాన్ని పంపించారని, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారని సమాచారం. తాను ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం మంత్రి ఈశ్వరప్ప అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆయన రాసినదేనా? కాదా? అనే అంశాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. 


‘‘నా మరణానికి బాధ్యుడు ఈశ్వరప్ప. ఆయనను శిక్షించాలి. నేను నా కోరికలన్నిటినీ అణచుకుని, ఈ పని చేస్తున్నాను. నా కుటుంబాన్ని రక్షించాలని పీఎం, సీఎం, యడియూరప్పలను కోరుతున్నాను’’ అని సంతోష్ పాటిల్ వాట్సాప్ సందేశంలో పేర్కొన్నారు. 


సంతోష్ పాటిల్ కొద్ది వారాల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. తనకు బాకీ ఉన్న బిల్లులను ఈశ్వరప్ప చెల్లించడం లేదని ఆరోపించారు. ఈశ్వరప్ప అబద్ధాలకోరు అని, అవినీతిపరుడని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన బిల్లులను పరిష్కరించాలని ఈశ్వరప్పను ఆదేశించాలని కోరారు. 


ఇదిలావుండగా, కర్ణాటక కాంగ్రెస్ బుధవారం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు ఓ లేఖ రాసింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరింది. సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఈశ్వరప్ప బెళగావి జిల్లాలో ఎటువంటి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా పనులను సంతోష్ చేత చేయించారని ఆరోపించింది. 


Updated Date - 2022-04-13T19:05:12+05:30 IST