కదులుతున్న కమలదండు

ABN , First Publish Date - 2022-06-28T16:56:53+05:30 IST

నగరం లో బీజేపీ శ్రేణుల హడావిడి మొదలైంది. వచ్చే నెలలో 2, 3 తేదీలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో

కదులుతున్న కమలదండు

జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు   

జనసమీకరణపై దృష్టి   

ఆలయాల్లో పూజలు


హైదరాబాద్‌ సిటీ: నగరం లో బీజేపీ శ్రేణుల హడావిడి మొదలైంది. వచ్చే నెలలో 2, 3 తేదీలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లలో నేతలు తలమునకలయ్యారు. ఇందుకోసం ఓ వైపు అధికారులు ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతుండగా, పార్టీ పరంగా జనసమీకరణకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షు డు నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు, వీఐపీ, సాధారణ రాకపోకలు, పార్కింగ్‌ సదుపాయం వంటి అంశాలపై అధికారులు, బీజేపీ నాయకులు చర్చించారు.  

విస్తృతంగా సమావేశాలు

పార్టీ కార్యకర్తలను సమీకరించడానికి అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్లు, బస్తీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నల్లకుంట డివిజన్‌లో బూత్‌ల వారీగా పార్టీశ్రేణులతో సమావేశం జరిగింది. బీఎన్‌రెడ్డినగర్‌, అల్లాపూర్‌లలో శక్తి కేంద్రం ఇన్‌చార్జిలు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 


ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావాలని పలు ఆలయాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోల్నాక డివిజన్‌లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో, అంబర్‌పేట పటేల్‌నగర్‌లోని శివాలయం, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడ చైతన్య విలాస్‌ కాలనీలో మల్లన్న స్వామి ఆలయంలో,  రామంతాపూర్‌ కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2022-06-28T16:56:53+05:30 IST