బల్దియా ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహం

ABN , First Publish Date - 2020-09-23T12:49:09+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌కు బీజేపీ ఆరుగురు అధ్యక్షులను నియమించింది. ఇంత వరకూ జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉండగా ఇప్పుడు ఏకంగా ఆరుగురిని నియమించి కొత్త పంథాకు

బల్దియా ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌కు బీజేపీ ఆరుగురు అధ్యక్షులను నియమించింది. ఇంత వరకూ జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉండగా ఇప్పుడు ఏకంగా ఆరుగురిని నియమించి కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ ఎన్నికలు వస్తున్న సమయంలో బీజేపీ నలువైపులా అధ్యక్షులను నియమించి పార్టీ కార్యకలాపాలను వికేంద్రీకరించింది. హైదరాబాద్‌ జిల్లాను నాలుగు విభాగాలుగా, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను అర్బన్‌, రూరల్‌గా విడదీసి వేర్వేరుగా అధ్యక్షులను నియమించింది. మొదట బీజేపీ నగర శాఖగా ఉండేది, ఈ తరువాత గ్రేటర్‌కు విస్తరించారు, ఆ తరువాత మళ్లీ నగరానికి కుదించారు. ఇప్పుడు ఏకంగా ఆరు భాగాలుగా విభజించి కొత్త రాజకీయానికి తెరలేపింది.


అధ్యక్షులు ఇలా...

నగర శాఖలో ఒక అధ్యక్షుడికి నాలుగు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. ఆయా ప్రాంతాలన ఒక్కో జిల్లాగా పరిగణించి అధ్యక్షులను నియమించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కొంత భాగాన్ని మహంకాళి - సికింద్రాబాద్‌ జిల్లాగా నిర్ణయించారు. ఇందులో ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. బర్కత్‌పురా - అంబర్‌పేట పరిధిలో అంబర్‌పేట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి నియోజకవర్గాలకు కలిపి డాక్టర్‌ ఎన్‌.గౌతంరావును జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గోల్కొండ - గోషామహల్‌ పరిధిలో గోషామహల్‌, చార్మినార్‌, కార్వాన్‌ నియోజకవర్గాలకు కలిపి వి.పాండుయాదవ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. భాగ్యనగర్‌-మలక్‌పేట పరిధిలో మలక్‌పేట, కార్వాన్‌, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురాలకు కలిపి సామారెడ్డి సురేందర్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మేడ్చల్‌ అర్బన్‌కు పన్నాల హరీ్‌షరెడ్డిని, రంగారెడ్డి అర్బన్‌కు సామా రంగారెడ్డిలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. 


పన్నాల హరీష్‌ రెడ్డి...

బీజేపీ మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరీష్‌ రెడ్డి గతంలో టీడీపీ తరఫున కేపీహెచ్‌బీ కాలనీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2016 గ్రేటర్‌ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి బాలాజీనగర్‌ డివిజన్‌ నుంచి భార్య కావ్యారెడ్డిని గెలిపించుకొన్నారు. స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలతో విభేదాలు రావడంతో పార్టీకి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ నుంచి కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఓటమిపాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు.


పాండుయాదవ్‌...

గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాండుయాదవ్‌ మాట్లాడుతూ త్వరలో జరిగే బల్దియా ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా తన వంతు కృషిచేస్తానన్నారు. తనకు ఈ పదవి అప్పగించిన బండి సంజయ్‌కు, ప్రేమేందర్‌ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.


శ్యాంసుందర్‌ గౌడ్‌...

సికింద్రాబాద్‌ మహంకాళీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సికింద్రాబాద్‌ మహంకాళీ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, కంటోన్మెంట్‌, నియోజకవర్గాలు రానున్నాయి. అమీర్‌పేటకు చెందిన క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా శ్యాంసుందర్‌ గౌడ్‌ వ్యవహరిస్తున్నారు. శ్యాంసుందర్‌ నియామకం వార్త వెలువడగానే ఆ పార్టీ నాయకులు ఆయనకు మిఠాయిలు తినిపించారు.


సామ రంగారెడ్డి...

బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గానికి చెందిన రంగారెడ్డి ఏడాది కిందట బీజేపీలో చేరారు. పార్టీకి చెందిన పాత, కొత్త కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకెళ్తుండటంతో.. ఆయన నాయకత్వాన్ని గుర్తించిన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. కార్యకర్తలు, నాయకులు, అనుచరులు మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


డా.గౌతమ్‌రావు...

బర్కత్‌పుర, అంబర్‌పేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నియోజకవర్గంలోని డీడీ కాలనీ నివాసి. పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలిచేలా కృషి చేస్తానని గౌతమ్‌రావు చెప్పారు. ఆయన నియామాకంపై మాజీ కార్పొరేటర్లు వనం రమేష్‌, నేమూరి సాంబశివగౌడ్‌ హర్షం వ్కక్తం చేశారు.


బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా...

గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పాండుయాదవ్‌ నియామకంపై కొంత మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పదవి నుంచి తొలగించాలంటూ మంగళవారం సాయంత్రం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. కొందరు ఆఫీస్‌లోకి చొరబడి కిటికీలు, పూలకుండీలు, కుర్చీలు ధ్వంసం చేశారు. పార్టీ సీనియర్‌ నాయకుడు ఉమామహేందర్‌కు అన్యాయం జరిగిందన్నారు. మాజీ కార్పొరేటర్‌ మెట్టువైకుంఠం, పార్టీ నేతలు శ్రీరాంవ్యాస్‌, మహేందర్‌ వ్యాస్‌, లక్ష్మణ్‌ జుబూదార్‌, నరసింహా తదితరులతో పాటు కార్యకర్తలు ఆఫీస్‌ ముందే ధర్నాకు దిగారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ కార్యాలయం విధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని పేర్కొన్నారు. సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకుందామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2020-09-23T12:49:09+05:30 IST