హథ్రాస్ గండంలో బీజేపీ

ABN , First Publish Date - 2020-10-09T06:05:16+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బిసాడలో 2015 సెప్టెంబర్‌లో మహమ్మద్ అఖ్లాక్ అనే యాభై ఏళ్ళ వ్యక్తిని చిత్రవధకు గురి చేసి చంపేశారు. గోమాంసాన్ని...

హథ్రాస్ గండంలో బీజేపీ

2019 సార్వత్రక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన విజయాలకు దళితులు నిర్ణయాత్మక తోడ్పాటు నందించారు. ఆ ఎన్నికల అనంతరం నిర్వహించిన ఒక సర్వేలో, దళిత ఓటర్లలో బీజేపీకి లభించిన మద్దతు ఐదేళ్ళ కాలంలో 24 శాతం నుంచి 34 శాతానికి పెరిగిందని వెల్లడయింది. ఈ నేపథ్యంలో హథ్రాస్ ఘటన బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకుండా అడ్డుకోవడం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గానీ, ఆయన పార్టీకి గానీ ఎంత మాత్రం మేలు చేయదు.


ఉత్తరప్రదేశ్‌లోని బిసాడలో 2015 సెప్టెంబర్‌లో మహమ్మద్ అఖ్లాక్ అనే యాభై ఏళ్ళ వ్యక్తిని చిత్రవధకు గురి చేసి చంపేశారు. గోమాంసాన్ని తిన్నాడని, ఆ మాంసాన్ని ఇంటిలో నిల్వ చేసుకున్నాడనే ఆరోపణతో అతని ప్రాణాలను తీసేశారు. అఖ్లాక్ హంతకులు అందరూ అగ్రకులస్థులు. వారిలో ప్రతి ఒక్కరికీ బెయిల్ లభించింది. ఆ కేసులోని ముద్దాయిలో ఒకరు చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలకు స్థానిక ఎంపి మహేశ్ శర్మ (అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు) హాజరయ్యారు. మృతుడి భౌతికకాయంపై త్రివర్ణపతాకను కప్పారు. 2019 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ప్రచార పర్వాన్ని బిసాడ గ్రామం నుంచే ప్రారంభించారు. ఆ సభలోని ముందు వరుసలోనే, అఖ్లాక్‌ను అంతమొందించిన వారిలో ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో అఖ్లాక్ ఘటనను ప్రస్తావించారు: ‘బిసాడ గ్రామంలో జరిగిందేమిటో ఎవరికి తెలియదు? ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజాన్ని కప్పిపుచ్చేందుకు సమాజ్‌వాది ప్రభుత్వం ఎంతో నిస్సిగ్గుగా వ్యవహరింది. మన ప్రభుత్వం కొలువు తీరిన వెన్వెంటనే అక్రమ కబేళాల మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తానని ఆయన అనడంతో’. నేరస్థునితో సహా సభికులందరు పెద్దపెట్టున అరుపులు, కేకలతో ఆనందం వ్యక్తంచేశారు. అలా తీవ్రమైన క్రిమినల్ అరోపణల నెదుర్కొంటున్న వారిని ముఖ్యమంత్రి బలపరిచడమేకాక చారు అఖ్లాక్ మరణం పట్ల రవ్వంత విచారం కూడా వ్యక్తం చేయలేదు. గ్రేటర్ నోయిడా బహిరంగ లోక్‌సభా నియోజకవర్గం (బిసాడ ఈ నియోజకవర్గంలోనే ఉంది)లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అదొక్కటే కాదు, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 నియోజకవర్గాలలో 73 స్థానాలను ఆ పార్టీయే కైవసం చేసుకున్నది. 

బిసాడ ఘటనపై ఆదిత్యనాథ్‌లో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తమవ్వలేదు. ఇప్పుడు బూల్‌గార్హీ దురంతమూ ఆయనలో ఎటువంటి అనుతాపాన్నీ కలిగించలేదు. అత్యాచార బాధితురాలి కుటుంబానికి సహాను భూతి తెలుపకపోగా కుల, మతతత్వ హింసాకాండను రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ‘అజ్ఞాత వ్యక్తుల’పై పలు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసింది. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు హథ్రాస్‌లో అగ్రకులాల పెత్తందారులతో ఒక పంచాయతీ నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కాపాడడమే లక్ష్యంగా ఆ పంచాయతీ జరిగింది. అంతేకాదు, సామాజిక మాధ్యమాలలో బాధితురాలి కుటుంబసభ్యుల కథనాలకు వ్యతిరేకంగా విషపూరిత ప్రచారం ఒకటి అలా ప్రారంభం కావడం, ఇలా ఉధృతమవడం జరిగిపోయాయి. బాధితురాలిపై అపనిందలు వెల్లువెత్తాయి. మరణించేముందు ఆ అభాగ్యురాలు తాను రాక్షసంగా మూకుమ్మడి అత్యాచారానికి గురయ్యానంటూ, ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తుల పేర్లతో సహా ఇచ్చిన వాంగ్మూలం ఆ ప్రచార గడబిడలో ఎవరికీ పట్టనేలేదు. అఖ్లాక్ కేసులో ‘దర్యాప్తు’, అతడు తన ఇంటిలో నిల్వ చేసుకున్నది మాంసమా లేక గో మాంసమా అన్న విషయానికి పరిమితం కాగా బూల్‌గార్హీ అత్యాచార వైనం నిశిత పరీక్షకు గురయింది. బాధితురాలి దేహంపై వీర్యం ఉన్నట్టు ఫోరెన్సిక్ పరీక్షలో కనుగొన్నారా లేదా అనే అంశానికి విపరీత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరమేమిటి? దారుణకృత్యానికి బలయిపోయిన కుమార్తెను కడసారి చూడడానికి కూడా తల్లిదండ్రులకు అవకాశమివ్వకుండా, అదీ అర్ధరాత్రి పోలీసులు స్వయంగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించినట్టు? మానవతను ఎందుకిలా కాలరాచేశారు? 

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎందుకిలా మొండిగా, మానవతా రహితంగా వ్యవహరిస్తోంది? అమాయకులైన తోటి మానవుల విషాదాంతాలు పాలకులను ఎందుకు కదిలించడం లేదు? పైగా నేరస్థులను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎందుకు దుర్వినియోగపరుస్తున్నారు? గమనార్హమైన విషయమేమిటంటే బిసాడ, బూల్‌గార్హీ ఘటనల్లో కీలకమైన తేడా ఉంది. అఖ్లాక్ ముస్లిం మతస్థుడు. యోగి ఆదిత్యనాథ్ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల పట్ల ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. ముస్లింల సామాజిక, రాజకీయ ప్రతిపత్తిని తగ్గించివేస్తున్నారు. ఇదంతా ఒక రాజకీయ ఎజెండా ప్రకారమే జరుగుతోందనేది స్పష్టం. ఆ ఎజెండాలో భాగంగానే ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎటువంటి హృదయ క్లేశం లేకుండా అఖ్లాక్ హంతకులకు వత్తాసుగా నిలబడ్డది. నిజానికి ఏ పౌర సమాజమైనా లేక రాజకీయ ఉద్యమమైనా అఖక్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తే అది బీజేపీకి అనుకూలంగా పరిణమించే పరిస్థితి. ఓటర్లను మత ప్రాతిపదికన చీల్చివేసేందుకు ఆ డిమాండ్ దానికి బాగా ఉపకరిస్తుంది. వాస్తవమేమిటంటే ముస్లింలకు భద్రత కల్పించడం, వారికి సంక్షేమాన్ని సమకూర్చడమనేది యోగి ప్రభుత్వానికి అంత ముఖ్యమైన విషయం కాదు. కనుకనే అఖ్లాక్ హంతకులు చట్టం బారి నుంచి అతి సులువుగా తప్పించుకోగలిగారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన గోరఖ్‌పూర్ డాక్టర్ కఫీల్ ఖాన్ నెలల తరబడి జైల్లో మగ్గవలసివచ్చింది. కొత్త పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించినవారు కఠిన చట్టాల బారిన పడవలసివచ్చింది. 

దళితుల పరిస్థితి ముస్లింలకు భిన్నమైనది. దళితుల జీవితాలకు భద్రత, సంక్షేమం సమకూర్చేందుకు పాలకులు ప్రాధాన్యమిస్తున్నారు. రాజకీయ కారణాల రీత్యా ఇది అనివార్యమయింది. మన నిచ్చెన మెట్ల సమాజంలో అగ్రకులాల వారిని సామాజికంగా సవాల్ చేయగల పరిస్థితిలో దళితులు లేరు. హథ్రాస్ (బూల్‌గార్హీ) ఘటనే ఇందుకు నిదర్శనం. దళితులు ఇప్నటికీ సంప్రదాయ కులవృత్తులకే పరిమితమయ్యారు. పారిశుద్ధ్య కార్మికులుగా వారు మినహా మరెవరైనా మీకు కన్పిస్తున్నారా? హిందూ సామాజిక వ్యవస్థ తమకు న్యాయం చేయడం లేదని వారికి బాగా తెలుసు. అందుకు వారు కుపితులవుతున్నారు. అయినా అత్యధికులు ఇప్పటికీ ‘కర్మ’ సిద్ధాంత ప్రభావంతో తమ దుస్థితికి తమకు తామే ఊరట పొందుతున్నారు. అయితే భారత రాజ్యాంగం వారికి రాజకీయ సాధికారిత కల్పించిందనే వాస్తవం క్రమంగా దృఢపడుతోంది 2019 సార్వత్రక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన విజయాలకు దళితులు నిర్ణయాత్మక తోడ్పాటు నందించారు. ‘సెంటర్ ఫర్ డెవెలపింగ్ సొసైటీస్’ పరిశోధకులు 2019 సార్వత్రక ఎన్నికల అనంతరం నిర్వహించిన ఒక సర్వేలో దళిత ఓటర్లలో బీజేపీకి లభించిన మద్దతు ఐదేళ్ళ కాలంలో 24 శాతం నుంచి 34 శాతానికి పెరిగిందని వెల్లడయింది. ఉత్తర భారతావనిలోని రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో అత్యధిక భాగాన్ని బీజేపీయే గెలుచుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇప్పటికీ జాతవ్ ఓటర్ల మద్దతుపైనే ఆధారపడిఉండగా జాతవ్ యేతర దళిత ఓటర్లలో అత్యధికులు బీజేపీకి మద్దతునిచ్చారు. ఈ మద్దతుదారులలో వాల్మీకి కులస్థులు కూడా ఉన్నారు. హథ్రాస్ అత్యాచార బాధితురాలు ఈ ఉప దళిత కులానికి చెందిన యువతే. ఇక్కడ స్పష్టంగా చెప్పేదేమిటంటే ఎటువంటి అపరాధ భావం లేకుండా మీరు అఖ్లాక్ హంతకుల పక్షాన బహిరంగంగా నిలబడవచ్చు. కానీ, హథ్రాస్ దళిత యువతిని రాక్షసంగా బలిగొన్నవారికి మాత్రం మద్దతునివ్వలేరు. 

మరో ముఖ్యమైన విషయమేమిటంటే హథ్రాస్ ఘటన నిందితులందరూ ఠాకూర్లు. ఈ సామాజిక వర్గానికి యోగి ఆదిత్యనాథ్ పభుత్వ ప్రాపకం ఉందనే విషయం అందరికీ విదితమే. ముఖ్యమంత్రి వ్యతిరేకులందరూ ఇప్పుడు ఆయన్ని అజయ్ సింగ్ బిష్త్ (యోగి అసలు నామధేయం) అని ప్రస్తావిస్తున్నారు. ఈ యోగి, ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వాడే కనుక అదే సామాజిక వర్గానికి చెందిన హథ్రాస్ ఘటన నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేయడమే ముఖ్యమంత్రి ప్రత్యర్థుల లక్ష్యం. ప్రభుత్వం ఠాకూర్లకు మాత్రమే అనుకూలం అన్న ముద్ర బీజేపీకి ఎంతైనా చేటు చేసే అవకాశముంది. అగ్రవర్ణాల వారి పార్టీ అనే మూస భావన నుంచి బయటపడిన తరువాత మాత్రమే బీజేపీ రాజకీయ శిఖరాలను అధిరోహించగలిగిందనేది ఎవరూ విస్మరించకూడని వాస్తవం. కనుకనే హథ్రాస్ ఘటన పట్ల యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వ ప్రతిస్పందనను బీజేపీకే చెందిన పలువురు దళిత ఎంపీలు, మరీ ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఓబీసీల అగ్రనేత ఉమా భారతి తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. వారి అభ్యంతరాలు ఆక్షేపణలు ఒక సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో అగ్రకులాల అనుకూల మనువాది పార్టీ అనే ముద్ర బీజేపిపై బలంగా ఉండడం వల్లే మాయావతీలు,, ములాయంలు రాజకీయ ప్రాభవాన్ని పొందగలిగారన్నదే ఆ సత్యం. ఈ సత్యాన్ని బీజేపీ నాయకులు స్వయంగా అంగీకరిస్తున్నారనే విషయాన్ని హథ్రాస్ ఘటన సందర్భంలో వారి ఆక్షేపణలు స్పష్టం చేశాయి. 

ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకుండా అడ్డుకోవడమంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిప్పుతో చెలగాటమాడడమే అవుతుంది. సమదృష్టితో వ్యవహరించకపోవడమే ఆయన వ్యవహార శైలి కదా. హథ్రాస్ అనంతరం కూడా అలా వ్యవహరించడం ఆయనకుగానీ, ఆయన పార్టీకి గానీ ఎంత మాత్రం మేలు చేయదు. గతంలో మాయావతి, ఆమె నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ విశేషంగా లబ్ధి పొందాయి. ఇప్పుడు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ లాంటి కొత్త తరం యువ దళితనేతలు రంగంలో ఉన్నారు. దళిత రాజకీయశక్తుల తిరుగులేని నాయకులుగా వారు ఆవిర్భవించే అవకాశం ఎంతగానో ఉంది. దళితనేతల నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వారు దృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. మరో వైపు ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా పునరుత్థానం పొందేందుకు సంసిద్ధమవుతోంది. ఇవన్నీ తీవ్ర పర్యవసానాలకు దారితీసే రాజకీయ పరిణామాలు అనడంలో సందేహం లేదు. మరి బీజేపీ గతంలో వలే నిశ్చింతగా, భవిష్యత్తుపై నిండు విశ్వాసంతో ఉండడమనేది అసాధ్యం. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాదికి పైగా వ్యవధి ఉంది. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో బీజేపీయే తిరుగులేని శక్తిగా వెలుగొందుతోంది. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోగల పటిష్ఠ సంస్థాగత యంత్రాంగం ఆ పార్టీకి ఉంది. అయినా సరే, అత్యంత జాగరూకతతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య ఎన్నికలలో విజయాన్ని కైవసం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ప్రజలను భయాందోళనలకు గురి చేసి, వారిలో విభేదాలు సృష్టించి లబ్ధి పొంవడానికి ప్రయత్నించే పాలకులు ప్రజాస్వామిక పరీక్షల్లో నెగ్గడం చాలా కష్టం.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-10-09T06:05:16+05:30 IST