ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం: మమత

ABN , First Publish Date - 2022-03-08T22:49:02+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి..

ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం: మమత

కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, బలమైన ప్రత్యామ్నాయం కనుక ఏర్పడితే ప్రజలు తప్పనిసరిగా బీజేపీని అధికారం నుంచి సాగనంపుతారని అన్నారు. టిఎంసీ సహా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడాలని అన్నారు. మంగళవారంనాడు పార్టీ సంస్థాగత సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు.


టీఎంసీ  చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ గత నెలలో తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో తన విధేయులే ఎక్కువ మంది ఉండేలా చూసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, యువ నేతలకు మధ్య విభేదాలు తలెత్తిన క్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీని మమతా బెనర్జీ పూర్తిగా ప్రక్షాళన చేశారు. పాతవారితో పాటు కొత్త తరం నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుబ్రత బక్షిని, సెక్రటరీ జనరల్‌గా పార్థ చటర్జీని నియమించారు. రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాతో సహా సుమారు 20 మంది ఉపాధ్యక్షులకు, 19 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమించారు.

Updated Date - 2022-03-08T22:49:02+05:30 IST