తెలంగాణలో బీజేపీదే అధికారం

ABN , First Publish Date - 2022-04-14T07:21:25+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ

తెలంగాణలో బీజేపీదే అధికారం

  • మా ఇంటి ఇలవేల్పు యాదగిరీశుడు.. ఆలయాల్లో రాజకీయాలు మాట్లాడను
  • మహాసంగ్రామ యాత్ర దిగ్విజయం కావాలని ప్రార్థించా: బండి సంజయ్‌
  • నేటి నుంచి రెండో విడత ప్రారంభం.. ఆప్‌ యాత్రా నేటి నుంచే 


యాదాద్రి/మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. బుధవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో రాయిగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు నిర్వహించిన ద్విచక్రవాహనాల ర్యాలీని రాయిగిరిలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రెండో విడత మహాసంగ్రామ యాత్ర నేపథ్యంలో యాదగిరిగుట్టలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనలేకపోతున్నానని, ర్యాలీని ప్రారంభించి హైదరాబాద్‌కు వెళ్లారు.


అంతకుముందు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని ఆయన దర్శించుకున్నారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని అద్దాల మండపం ఎదుట అర్చకులు ఆయనను ఆశీర్వదించగా, దేవస్థాన అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ యాదగిరీశుడు తమ ఇంటిదైవమని, మహాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందుగా ఇష్టదైవాన్ని దర్శించుకుని, యాత్ర దిగ్విజయం కావాలని ప్రార్థించానని తెలిపారు. ఆధ్యాత్మికతకు నిలయమైన ఆలయాల్లో రాజకీయాల ప్రస్తావన తీసుకురానని, దైవదర్శనంతో తిరిగి వెళుతున్నానని చెప్పారు.


 కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత కార్యక్రమం అలంపూర్‌లో గురువారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సంజయ్‌ అలంపూర్‌ చేరుకుంటారు. పార్టీ నాయకులతో కలిసి జోగుళాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రసాదం పథకం కింద చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత పాదయాత్ర ప్రారంభించి, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇమాంపురం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ఇప్పటికే అలంపూర్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు.


ఆప్‌ యాత్రా నేటి నుంచే 

తెలంగాణపై దృష్టి పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గురువారం నుంచి పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఆ పార్టీ తెలంగాణ సర్చ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఇందిరా శోభన్‌ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరగనుంది. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌ వద్ద  ఆయన విగ్రహం దగ్గరి నుంచి యాత్రను ఇందిరాశోభన్‌ ప్రారంభిస్తున్నారు. మొదటి దశలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మొత్తం ఆ పార్టీ నేతలు పాల్గొంటారు.


Updated Date - 2022-04-14T07:21:25+05:30 IST