ముందస్తు లేదంటూనే బీజేపీ రహస్య సర్వేలు

ABN , First Publish Date - 2022-03-21T18:20:13+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగంగా

ముందస్తు లేదంటూనే బీజేపీ రహస్య సర్వేలు

                     - 224 నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితిపై ఆరా


బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగంగా ముందస్తు లేదంటూ వ్యాఖ్యానిస్తున్నా అంతర్గతంగా మాత్రం దక్షిణాదిన అవకాశం ఉన్న కర్ణాటకలో మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలపైనా ఇంటిలిజెన్స్‌ ద్వారా సర్వేలు జరిపించినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ బలం, బలహీనతతోపాటు ఇతర పార్టీల గురించి సమగ్రంగా ఆరా తీసినట్టు సమాచారం. ఏడాది చివరలో ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీజేపీకి ఏ విధమైన అనుకూలం కానుందనే కోణంలోనే సర్వే సాగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ పరంగా అధికార బీజేపీ కంటే నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాల ద్వారా ప్రజలను ఆకర్షించేలా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రం లో మరోసారి బీజేపీ గెలవదని కాంగ్రెస్‌దే అధికారం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అప్పుడే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న విషయం కూడా తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం లో ముందంజలో ఉన్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరమైన పరాభవం చోటు చేసుకోవడం, ఆ తర్వాత అధిష్ఠానంపై వస్తున్న విమర్శలు, ప్రత్యేక కూటములతో పెద్ద దిక్కు ఎవరనే మీమాంస తలెత్తింది. గాంధీ కుటుంబానికి విధేయులమై ఉంటామని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించడం, వీరప్ప మొయిలీ కూడా జీ-23 కూటమి నుంచి బయటకు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీ అన్ని విధాలా ప్రగతిపరంగా ఉన్నా అధిష్ఠానం బలహీనంగా ఉందని, ఇదే తరుణంలో కర్ణాటకను చేజిక్కించుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్నిసీట్లు, ఏడాది చివరికైతే ఎటువంటి మార్పులు అనే కోణంలోనూ సమీక్ష జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓవైపు రహస్య సర్వేలు కొనసాగుతుండగానే ఏప్రిల్‌ 1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి రానుండడం కూడా ప్రత్యేక కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీ జేపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతోంది. రెండేళ్లపాటు యడియూరప్ప పాలనలో వరుసగా అతివృష్టి, కొవిడ్‌ ప్రభావం చూపింది. ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై పాలన చేపట్టాక హిజాబ్‌ వి వాదం, శివమొగ్గలో హర్ష హత్య, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మేకెదాటు వంటి అంశాలు కీలకమైనవి. నియోజకవర్గాల వారీగా సర్వేలో పార్టీకి అనుకూలమైతే మ రిన్ని ప్రయోగాలు చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-03-21T18:20:13+05:30 IST